కొబ్బరి నూనెకు పెరిగిన డిమాండు

వీరమాచినేని రామకృష్ణ ఆరోగ్య సూచనల ప్రభావం

 

అంబాజీపేట కేంద్రంగా పెరుగుతున్న నూనె అమ్మకాలు
కిలో కొబ్బరినూనె రూ.320పైమాటే..
అధిక బరువు, మధుమేహం నివారణల్లో నూనె కీలకం
అంబాజీపేట కేంద్రంగా పెరుగుతున్న నూనె అమ్మకాలు
 
(ఆంధ్రజ్యోతి-అమలాపురం):కేవలం మనం తలకు వాడే కొబ్బరి నూనె ఇప్పుడు బ్రహ్మాండమైన సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధంగా మారింది. రెండు చెంచాలు కొబ్బరి నూనె తాగితే రోజుల్లోనే మీ ఆరోగ్య సమస్యలు మటుమాయమంటూ వీరమాచనేని రామకృష్ణ ప్రవేశపెట్టిన సరికొత్త ఆరోగ్య ప్రణాళిక ఫలితాల మాటెలా ఉన్నా, కోనసీమకు మాత్రం భలే కలిసొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపుతున్న ఈ నూనె సేవనం.. కోనసీమ కొబ్బరి నూనెకు ఎనలేని డిమాండు తెచ్చిపెట్టింది. అధిక బరువు, మధుమేహం, హైబీపీ వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి  కొబ్బరి నూనె నివారణోపాయంగా మారింది. కేరళ మాదిరిగా కొబ్బరి నూనె వంటకాలూ చేస్తుండడంతో కొబ్బరినూనె విక్రయాలు  జోరందుకున్నాయి. అంబాజీపేట కేంద్రం నుంచి స్వచ్ఛమైన కొబ్బరినూనె ఎగుమతులు పెరగడంతో వ్యాపారులకు మంచి ఆదాయాన్నిస్తోంది.
 
విజయవాడకు చెందిన వీరమాచినేని రామకృష్ణ కొబ్బరి నూనె వినియోగం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల నివారణ అవుతాయని తేల్చిచెప్పడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలామంది ఆయన ప్రకటించిన డైట్‌పై దృష్టిసారించారు. దీనిలో భాగంగా కొబ్బరినూనె వినియోగంతోపాటు ఆ నూనెతో చేసిన వంటకాలు తినడం వల్ల రోగాల నుంచి విముక్తి పొందవచ్చునన్న ప్రచారం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. దాంతో కొబ్బరినూనెకు రోజురోజుకూ డిమాండు పెరుగుతోంది. ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన కొబ్బరినూనెను వంటకాల్లో వినియోగించడం లేదా సేవించడంతోపాటు రామకృష్ణారావు చేసిన సూచనల మేరకు ఆరోగ్య నియమాలను పాటిస్తే అనేక రోగాలనుంచి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు. దీనిలో భాగంగా అధిక బరువు తగ్గడం, మధుమేహం, హైబీపీ నివారణకు ఈ సూచనలు సత్ఫలితాలనిస్తున్నాయన్న ప్రచారం ఊపం దుకోవడంతో వివిధరకాల రోగగ్రస్తులు పెద్దఎత్తున వీరమాచినేని డైట్‌ పాటిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే 17న కాకినాడలో ప్రత్యేక సెమినార్‌ను వీరమాచినేని రామకృష్ణారావు నిర్వహించనున్నారు. కొబ్బరి నూనె సేవి ంచే రోగగ్రస్తులకు అనూహ్యమైన సత్ఫలితాలను సాధిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతుండడంతో కొబ్బరినూనెకు మార్కెట్‌లో మంచి డిమాండు పెరిగింది. ఇప్పుడు ఎక్కడికక్కడే ఆయిల్‌ మిల్లుల వద్ద స్వచ్ఛమైన కొబ్బరి నూనె అంటూ బాటిల్స్‌ పెట్టి విక్రయాలు జోరుగా చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ కేంద్రంగా నిత్యం వందలాది లారీల్లో వివిధరకాల గ్రేడుల్లో కొబ్బరి సరుకు రవాణా సాగుతుంది. అలాగే కొబ్బరినూనె మార్కెట్‌కూడా ప్రసిద్ధిచెందిన మార్కెట్‌గా బాసిల్లుతోంది. 
 
ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు కొబ్బరి నూనె విక్రయాలు జోరుగా పెరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏడు నెలలపాటు నిల్వచేసిన కొబ్బరికాయల కుడకల ద్వారా స్వచ్ఛమైన కొబ్బరినూనెను తయారు చేస్తున్నారు. వందకిలోల కొబ్బరి కొడితే 55నుంచి 60కిలోల వరకు స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉత్పత్తి అవుతుంది. గతంలోకంటే ఇప్పుడు కొబ్బరి నూనెకు ప్రాచుర్యం పెరగడం వల్ల మార్కెట్‌ ధరల్లో మార్పు కనిపిస్తోంది. గతంలో కిలో కొబ్బరినూనె రూ.280 ఉండేది. ఇప్పుడు రూ.320లకు చేరింది. ఎక్కడికక్కడే కొబ్బరినూనె బాటిల్స్‌ను సిద్ధంచేసి జోరుగా విక్రయిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతితోపాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌కు కొబ్బరినూనె బాటిల్స్‌ రవాణా భారీగా సాగుతోంది. ఎందుకు కొనుగోలు చేస్తున్నారని కొందరు వినియోగదారులను ప్రశ్నిస్తే వెయిట్‌లాస్‌, షుగరు నుంచి విముక్తి పొందేందుకు ఈ ప్రక్రియ కీలకంగా మారి సత్ఫలితాలనిస్తుందని, అందుకే తాము వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తంమీద వీరమాచినేని రామకృష్ణ ఆరోగ్యసూత్రాల ప్రభావం కొబ్బరినూనె మార్కెట్‌పై విపరీతమైన ప్రభావం చూపడం పట్ల అటు వ్యాపారులు, ఇటు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
పెరిగిన అమ్మకాలు
వైద్యుల సూచనలతో వివిధరోగాల బారినపడ్డవారు కొబ్బరినూనె వినియోగంపై పడ్డారు. కొబ్బరినూనెతో వంటకాలతోపాటు తేనీటితో సేవించడం వంటివాటిని వినియోగించడంవల్ల స్వచ్ఛమైన కొబ్బరినూనెకు డిమాండు పెరిగింది. అనేక ప్రాంతాలనుంచి వచ్చినవారు నిల్వచేసిన కొబ్బరిసరుకును నేరుగా కొనుగోలు చేసి ఆడించుకునేందుకు కూడా పట్టుకెళ్తున్నారు. విజయవాడ వైద్యులు చేసిన సూచనతో కొబ్బరినూనె వైద్యంపట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. 
గెల్లి సంతోష్‌, కొబ్బరినూనె వ్యాపారి 
 
కొబ్బరినూనె వైద్యంతో సత్ఫలితం
వీరమాచినేని వైద్యవిధానంలో భాగంగా కొబ్బరినూనెతో ద్రవపదార్థాలను సేవించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించింది. రోజుకు 75నుంచి 100గ్రాముల కొబ్బరి నూనెను వివిధరూపాల్లో తీసుకోవడం జరుగుతోంది. వైద్యవిధానంలో తాగునీటితోపాటు కొబ్బరినూనె ప్రాధాన్యత ఎక్కువ. నెలరోజులపాటు ఈ వైద్యం కొనసాగించా. 84 కిలోల బరువునుంచి 76కిలోలకు తగ్గడంతోపాటు కొలెస్ట్రాల్‌ అదుపులోకి వచ్చింది. 
జక్కం వెంకటకృష్ణారావు, అమలాపురం