వైద్యం మరింత చేరువ

63ఆస్పత్రుల్లో 2,440 అదనపు పడకలు
2,474 కొత్త పోస్టులకు కేబినెట్‌ ఆమోదం
రెండు గిరిజన ఆస్పత్రులకు జిల్లాస్థాయి

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేయడం ద్వారా వారికి మెరుగైన సేవలు అందించడానికి ప్రభు త్వం సంకల్పించింది. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా అదనపు బెడ్లు, సిబ్బం ది, భవనాల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు రం గం సిద్ధం చేసింది. గత రెండు కేబినెట్‌ సమావేశాల్లో కలిపి మొత్తం 63 ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల కొత్తగా 2,440 పడకలు, 2,474 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఏపీవీవీపీ పరిధిలోని ఆస్పత్రులకు 1,220 బెడ్లు, 1,306 పోస్టులు మంజూరు చేశారు. అలాగే పాడేరు, పార్వతీపురం, తణుకు ఆస్పత్రులకు జిల్లాస్థాయి హోదా కల్పించారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇప్పటివరకు ఈ స్థాయి లేదు. ఈ అవకాశం తొలిసారిగా పాడేరు, పార్వతీపురం ఆస్పత్రులకు దక్కింది. ఏలూరు, విజయనగరం జిల్లా ఆస్పత్రులకు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసేందుకు, ఒక్కో కాలేజీకి రూ.266కోట్ల చొప్పున మొత్తం రూ.532కోట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.