నిమ్స్‌కు 3 రోజులు సెలవు

హైదరాబాద్, 04-04-2019 (ఆంధ్రజ్యోతి): ఈనెల 5, 6 తేదీలలో నిమ్స్‌ ఆస్పత్రికి సెలవు ప్రకటించారు. 7వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు ఓపీ సేవలు ఉండవని నిమ్స్‌ అధికారులు ప్రకటించారు. 5న బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి, 6న ఉగాది, 7వ తేదీ ఆదివారం కావటంతో వరుస సెలవులు వచ్చాయని, సోమవారం నుంచి యథావిధిగా సేవలు అందుతాయని నిమ్స్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ తెలిపారు.
 
ఆర్జిత సెలవులపై నిలదీత
నిమ్స్‌ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల ఆర్జిత సెలవులు విషయంలో బుధవారం వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ను నిలదీశారు. తెలంగాణ ఉద్యోగ సంఘం, నిమ్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, నిమ్స్‌ నర్సెస్‌ యూనియన్‌ నేతలు డైరెక్టర్‌ ఛాంబర్‌కు వెళ్లి, తమకు మూడేళ్లుగా రావాల్సిన ఆర్జిత సెలవలకు సంబంధించి బకాయిల విషయం తేల్చాలని పట్టుపట్టినట్లు తెలిసింది. ప్రతీ ఉద్యోగికి ఏడాదికి సుమారు 30 ఆర్జిత సెలవులు ఉండగా, ఇందులో వినియోగించుకోని వారి బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది.