‘ఉస్మానియా’కు రూ.3కోట్ల సామగ్రి

ప్రవాస భారతీయుడి దాతృత్వం
అమెరికా నుంచి మందులు, పరికరాలు
అతి త్వరలో అప్పగించనున్న అధికారులు

హైదరాబాద్, 02-11-2018: ఉస్మానియా ఆస్పత్రి పట్ల ఉదారతను చాటుకున్నాడు ఓ ప్రవాస భారతీయుడు. తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడిన వైద్యుడు దాదాపు రూ.3కోట్ల మందులు, పరికరాలను అందించాడు. మూడు భారీ వాహనాల్లో వచ్చిన మందులు, సిరంజీలు, బీపీ ఆపరేటర్లతోపాటు శస్త్రచికిత్సాలయాల్లో వాడే అతి ముఖ్యమైన యంత్రాలు, లైట్లు, సామగ్రిని ఇటీవల ఆస్పత్రికి తీసుకొచ్చారు. వరంగల్‌లో వైద్య విద్యనభ్యసించిన చరణ్‌జీత్‌రెడ్డి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. బన్ను ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆయన రూ.3కోట్ల సామగ్రిని ఉస్మానియా ఆస్పత్రికి డొనేట్‌ చేశారు. కొన్ని మందులు గడువు తేదీకి దగ్గరలో ఉండడంతో అధికారులు సూచనల మేరకు పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు సనత్‌నగర్‌లోని డ్రక్స్‌ కంట్రోల్‌ కార్యాలయానికి వాహనాలను తరలించారు. పరిశీలన అనంతరం ఉస్మానియాకు తీసుకురానున్నట్లు ఉస్మానియా వర్గాలు తెలిపాయి. చరణ్‌జీత్‌రెడ్డికి పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు.