ఈ నెల 27న తెలంగాణ ఎయిమ్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్మించిన ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాల, ఆస్పత్రి ‘ఎయిమ్స్‌’... ప్రారంభానికి సిద్ధమైంది. బీబీనగర్‌లోని 160 ఎకరాల్లో ఉన్న నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) ప్రాంగణంలో ఈ నెల 27న దీనిని ప్రారంభించనున్నారు. ఈనెల మొదటి వారంలోనే ఎయిమ్స్‌ను ప్రారంభించాల్సి ఉండగా భవనాల మరమ్మతులు, బోధన సిబ్బంది నియామకం పూర్తి కాకపోవడంతో జాప్యమైంది. దీని నిర్వహణ బాధ్యతలను భోపాల్‌ ఎయిమ్స్‌కు అప్పగించారు. వైద్యవిద్య బోధన కోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి సీనియర్‌ ప్రొఫెసర్లను నియమించారు. తొలుత 50 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభం కానున్నాయి. 960 పడకల ఆస్పత్రి, 100 మంది విద్యార్థులకు సీట్లు, 42 సూపర్‌ స్పెషాలిటీ సేవలతో కూడిన ఎయిమ్స్‌ను నిరుడు ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.