నిలకడగా చిన్నారుల ఆరోగ్యం

హైదరాబాద్‌ సిటీ/మంగళ్‌హాట్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): నాంపల్లి యూపీహెచ్‌సీలో టీకాలు వేశాక అస్వస్థతకు గురైన చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం గడిస్తే.. గండం నుంచి గట్టేక్కె అవకాశముందని నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆ పీహెచ్‌సీలో 92 మంది చిన్నారులకు పెంటలావాలెంట్‌ టీకాలు వేయగా 36 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడం, ఇద్దరు మృతి చెందడం తెలిసిందే. కాగా ఆందోళనకరంగా ఉన్న 15 మందిని బుధవారం నిలోఫర్‌లో చేర్పించగా, గురువారం ఉదయం మరో ఏడుగురు, రాత్రి మరో పది మంది చేరారు. శుక్రవారం మరో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ప్రస్తుతం 34 మంది శిశువులు నిలోఫర్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మినహా మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ట్రెమడాల్‌ మాత్ర ప్రబావం తీవ్రత మరో 24 గంటలు గడిస్తే తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. డీఎంఈ డాక్టర్‌ రమే్‌షరెడ్డి శుక్రవారం ఆస్పత్రిని సందర్శించారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ముగ్గురికి వెంటిలేటర్‌ తొలగించినట్లు తెలిపారు.