20 ఏళ్ల ముందు నుంచే షుగర్‌ లక్షణాలు!

వ్యాధి బయటపడక మునుపే గుర్తించవచ్చు
జపాన్‌ పరిశోధకుల అధ్యయనం
‘ఇక తప్పదు బాస్‌! రోజూ వాకింగ్‌ చేయాలి!
ఎడాపెడా తినొద్దు! స్వీట్స్‌ పూర్తిగా బంద్‌!’...
 
09-10-2018:‘మీకు షుగర్‌ వచ్చేసింది’... అని డాక్టర్‌ చెప్పగానే తీసుకునే జాగ్రత్తలివి! అసలు విషయం ఏమిటంటే... షుగర్‌ వచ్చిందని నిర్ధారించడానికి 20 ఏళ్ల ముందే ఆ లక్షణాలను తెలుసుకోవచ్చునట! అంటే, అప్పటి నుంచే జాగ్రత్త పడుతూ రాబోయే షుగర్‌ను వీలైనంతగా వాయిదా వేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జపాన్‌కు చెందిన షిన్షు విశ్వవిద్యాలయ నిపుణులు ఈ విషయాన్ని గుర్తించారు. నిజానికి, షుగర్‌ను నిర్ధారించడానికి పదేళ్లముందు నుంచే ఆ లక్షణాలు మొదలై ఉండొచ్చునని గతంలో ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇప్పుడు... పది కాదు 20 ఏళ్లముందే షుగర్‌ రాబోయే లక్షణాలను గుర్తించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ హిరొయుకీ సాగెసాకా, ప్రొఫెసర్‌ మిత్సుహిసా కొమట్సు తెలిపారు.
 
రక్తంలో చక్కెర పెరగడం, అధిక బీఎంఐ, ఇన్సులిన్‌ సరిగా ఉత్పత్తికాకపోవడం... స్థూలంగా చెప్పాలంటే ఇదే మధుమేహం! దీనికి సంబంధించిన జీవక్రియ లక్షణాలు 20 ఏళ్ల ముందు నుంచే బయటపడతాయట! ఈ పరిశోధనలో 27,392 మందిపై 2005 నుంచి 2016 మధ్య అధ్యయనం చేశారు. ఈ సమయంలోనే 1067 మందికి షుగర్‌ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. మిగిలిన వారితో పోల్చితే వీరిలో బీఎంఐ, ఇన్సులిన్‌ విడుదల, రక్తంలో చక్కెర శాతం వంటి ‘రిస్క్‌ ఫ్యాక్టర్స్‌’ అంతకు పదేళ్ల ముందే కనిపించాయి. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది టైప్‌-2 డయాబెటి్‌సతో బాధపడుతున్నారు. ప్రిడయాబెటిస్‌ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే పూర్తిస్థాయి మధుమేహంగా మారకుం డా జాగ్రత్తపడవచ్చు’’ అని సాగెసాకా తెలిపారు.