రెస్టారెంట్లు, మాంసం దుకాణాల్లో తనిఖీలు

నిల్వ ఉంచిన మాంసం, మసాలాల పారబోత

భారీగా జరిమానాలు విధింపు
స్వచ్ఛమైన ఆహారం అందించకుంటే చర్యలు ..
రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ చంద్రదండు ప్రకాష్‌నాయుడు  

వినుకొండ, గుంటూరు, మార్చి 14 :  పట్టణంలో బుధవారం మాంసం దుకాణాలు, రెస్టారెంట్‌లలో రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ చంద్రదండు ప్రకాష్‌నాయుడు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించి నిల్వ ఉంచిన, పాడైపోయిన చికెన్‌, మటన్‌, ఫిష్‌, రొయ్యలు, మసాలాలను గుర్తించి వాటిని మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బందితో బయట పారవేయించారు. అనంతరం అన్నపూర్ణ బిర్యాని పాయింట్‌లో తనిఖీలు నిర్వహించి శుభ్రత సరిగ్గా లేదని రూ.10 వేలు జరిమానా, నాగార్జున బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, చందమామ ఫ్యామిలీ రెస్టారెంట్‌లలో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని గుర్తించి వారికి రూ.50 వేలు చొప్పున జరిమానా విధించారు. మటన్‌, చికెన్‌ షాపులను తనిఖీ చేసి శుభ్రత పాటించనందుకు రూ.2 వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడి వారికి ఆహార భద్రత కల్పించడానికి సీఎం చంద్రబాబునాయుడు విస్తృతంగా కృషి చేస్తున్నారన్నారు. అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా ప్రజలు అనేక రకాల జబ్బులకు గురవుతున్నారని, హోటళ్లు, రెస్టారెంట్‌లలో శుభ్రమైన, స్వచ్ఛమైన మాంసాహారాలను ప్రజలకు అందించాలని, లేకుంటే రెస్టారెంట్లు హోటల్స్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయనతోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ డి.రవీంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఇస్మాయిల్‌, సిబ్బంది ఉన్నారు.