జీవచ్ఛవాలకు మరణించే హక్కుంది

కారుణ్య మరణంపై సుప్రీం సంచలన తీర్పు..

మరణేచ్ఛపై ముందే వీలునామా రాయొచ్చు
కోలుకోలేని వ్యాధికి చికిత్స నిలిపివేత కోరచ్చు..
అదీ జీవించే హక్కులో భాగమే
ప్రాణాధార పరికరాల తొలగింపుతో చంపొచ్చు..
డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి: సుప్రీం
కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మరణేచ్ఛపై ముందే వీలునామా రాయొచ్చు
 
న్యూఢిల్లీ, మార్చి 9: నయంకాని వ్యాధితో మంచాన పడి, శాశ్వతంగా కోలుకోలేని పరిస్థితి వచ్చినా... ‘చచ్చినట్లు’ బతికి తీరాల్సిందేనా? ఆ బాధలు పడాల్సిందేనా? అనే ప్రశ్నకు సుప్రీం కోర్టు ‘అక్కర్లేదు’ అనే సమాధానం ఇచ్చింది. ‘మరణానికి వీలునామా’ రాసుకునే అవకాశాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం కల్పించింది. కొన్ని షరతులు, మార్గదర్శకాలకు లోబడి.. పరోక్ష పద్ధతిలో రోగికి మరణం ద్వారా ఉపశమనం కల్పించవచ్చునని తెలిపింది. ‘‘నయంకాని వ్యాధితో బాధపడుతున్న నేను... ఎప్పటికీ కోలుకోలేని పరిస్థితి వచ్చినప్పటికీ అలాగే బతకాలని లేదు. తదుపరి చికిత్స నిలిపివేసి నాకు గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించండి’’ అని రోగి స్వయంగా తన ‘మరణేచ్ఛ వీలునామా’ రాసుకోవచ్చునని తెలిపింది.
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. పరోక్ష కారుణ్య మరణం (ప్యాసిప్‌ యుథనేషియా)పై ధర్మాసనంలోని ఇతర సభ్యులు... జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ‘మరణేచ్ఛ వీలునామా’ పై అందరూ ఒకే మాట చెప్పారు. నిజానికి... అరుణా షాన్‌బాగ్‌ కేసులో 2011లోనే సుప్రీంకోర్టు పరోక్ష కారుణ్య మరణాన్ని ప్రసాదించవచ్చునని తెలిపింది. ‘జీవించే హక్కులో మరణించే హక్కు భాగమే’ అని 1996లోనే రాజ్యాంగ ధర్మాసనం జ్ఞాన్‌కౌర్‌ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ధారించింది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని, మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ‘కామన్‌ కాజ్‌’ అనే స్వచ్ఛ ంద సంస్థ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
 
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు...‘మరణేచ్ఛ వీలునామా’ రాసుకున్న వారికి కారుణ్య మరణం ప్రసాదించవచ్చునని తెలిపింది. దీనికి సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలు రూపొందించింది. దీనిపై పార్లమెంటులో చట్టం చేసేదాకా... ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా దీనిపై సమగ్ర, సవివర చట్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై జస్టిస్‌ ఖన్విల్కర్‌ తరఫున కూడా జస్టిస్‌ మిశ్రా తీర్పు రాశారు. ఇదే అభిప్రాయంతో ఏకీభవిస్తూ మిగిలిన ముగ్గురూ మరో తీర్పు లిఖించారు. ఈ అంశంపై సుప్రీం ధర్మాసనం మొత్తం 538పేజీల తీర్పును వెలువరించింది. కారుణ్య మరణానికి వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న అన్ని ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, దీనికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. పరోక్ష కారు ణ్య మరణాన్ని ఎప్పుడు, ఎలా, ఎవరి విషయంలో అమలు చేయాలనే మార్గదర్శనాలను సవివరంగా పొందుపరిచింది.
 
వీలునామా లేకున్నా...
ఎలాంటి చికిత్స చేసిన కోలుకోలేని పరిస్థితిలో... ఆ రోగి ముందస్తు వీలునామా రాయకపోయినప్పటికీ... కుటుంబసభ్యుల విన్నపం మేరకు పరోక్ష కారుణ్య మరణాన్ని ప్రసాదించవచ్చు. ఇందుకు మార్గదర్శకాలు...
ఆ రోగి పరిస్థితిని సంబంధిత వైద్యుడు ఆస్పత్రి నిర్వాహకులకు తెలియచేయాలి. అప్పుడు... ఆస్పత్రి దీనిపై మెడికల్‌ బోర్డును నియమిస్తుంది. కారుణ్య మరణానికి రోగి అర్హుడని బోర్డు నిర్ధారిస్తే... ఈ సమాచారాన్ని కలెక్టర్‌కు తెలపాలి. అప్పుడు కలెక్టరు... జిల్లా ప్రధాన వైద్యాధికారి నేతృత్వంలో, ముగ్గురు వైద్య నిపుణులతో మరో బృందాన్ని నియమించాలి. కారుణ్య మరణానికి బోర్డు నిరాకరిస్తే... రోగి కుటుంబ సభ్యులు, చికిత్స చేసిన వైద్యుడు లేదా ఆస్పత్రి వర్గాలు హైకోర్టును ఆశ్రయించవచ్చు.
 
ఇవీ మార్గదర్శకాలు...
నయంకాని వ్యాధుల బారిన పడినవారు, శాశ్వతంగా కోలుకోలేని స్థితిలో ఉన్న వారు (పర్‌సిస్టెంట్‌ వెజిటేటివ్‌ స్టేట్‌ - పీవీఎస్‌) ముందుగానే తమ ‘మరణేచ్ఛ’ను తెలియచేయవచ్చు.
మానసిక ఆరోగ్యంతో రాసిన మరణేచ్ఛ వీలునామాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
ఈ వీలునామాను ఎందుకు రాస్తున్నాను అనే స్పష్టత ఆ రోగికి ఉండి, ఆ విషయాన్ని వ్యక్తపరచగలగాలి.
ఎప్పుడు,ఎలాంటి పరిస్థితుల్లో తనకు వైద్యం నిలిపివేయాలనేది స్పష్టంగా రాయాలి.
మరణేచ్ఛ వీలునామాను రోగి ఆకాంక్ష మేరకు అమలు చేయాలి. బలవంతం చేయరాదు.
వీలునామా రాసినప్పటికీ కీలక సమయానికి రోగి సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే... ప్రాణాధార వ్యవస్థను నిలిపివేయడంపై నిర్ణయం తెలిపాల్సిన సంరక్షకుడు/సన్నిహిత బంధువు పేరును కూడా రాయాలి.
ఈ వీలునామా అమలు వల్ల తలెత్తే పరిణామాలపట్ల రోగికి పూర్తి అవగాహన ఉండాలి.
ఒకటికంటే ఎక్కువ మరణేచ్ఛ వీలునామాలు ఉంటే... తాజాగా రాసిన దానిని పరిగణనలోకి తీసుకోవాలి.
ఈ వీలునామాపై ఇద్దరు సాక్షుల సమక్షంలో రోగి సంతకం చేయాలి. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ దీనిపై కౌంటర్‌ సిగ్నేచర్‌ చేసి... వీలునామా డిజిటల్‌ కాపీని తన వద్ద భద్రపరుచుకోవాలి.
రోగి వీలునామా అమలుపై సంబంధిత ఆస్పత్రి ఒక మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో... సంబంధిత వ్యాధికి చెందిన విభాగం అధిపతితోపాటు జనరల్‌ మెడిసిన్‌, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రీ, ఆంకాలజీ విభాగాలకు చెందిన కనీసం ముగ్గురు నిపుణులు ఉండాలి. వీరికి కనీసం 20 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
‘ఎంత చికిత్స చేసినా కోలుకునే అవకాశం లేదు’ అని సంబంధిత వైద్యుడు ఇచ్చిన సమాచారంలో నిజానిజాలను మేజిస్ట్రేట్‌ నిర్ధారించుకున్న తర్వాతే వీలునామా అమలుకు అనుమతించాలి.
‘మరణేచ్ఛ వీలునామా అమలుకు ఈ రోగి అర్హుడు కాదు’ అని మెడికల్‌ బోర్డు నిర్ధారిస్తే... దీనిపై రోగి, అతని కుటుంబసభ్యులు, వైద్యుడు, ఆస్పత్రి సిబ్బందిలో ఎవరైనా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ప్రధాన న్యాయమూర్తి నియమించే ధర్మాసనం, వీలైనంత త్వరగా దీనిపై విచారణ జరిపి తీర్పు చెప్పాల్సి ఉంటుంది.

చావు... పుట్టుకల మధ్య!

పుట్టిన వారికి మరణం తప్పదు. చావు, పుట్టుకలను వేర్వేరుగా చూడలేం! ‘బతుకుపై ఆశ సన్నగిల్లుతోంది. ఉనికిపై మసక చీకటి అలుముకుంటోంది. జీవనయానం కొనసాగించాల్సిన అవసరంపై తనలోనే సంఘర్షణ తలెత్తుతోంది. బలవంతంగా జీవించడం అవసరమా అనే ప్రశ్న ఉదయిస్తోంది! ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రోగికి సునాయాస, సుఖమైన మరణాన్ని ప్రసాదించవచ్చు. రాజ్యాంగంలోని 21వ అధికరణ పౌరులందరికీ జీవించే హక్కును కల్పిస్తోంది. సునాయాసంగా, గౌరవప్రదంగా మరణించడం కూడా ‘జీవించే హక్కు’లో భాగమే! మరణించేదాకా గౌరవంగా జీవించ వచ్చునని రాజ్యాంగమే చెబుతోంది. రోగి బాధను వీలైనంత తగ్గించి... మరణాన్ని త్వరగా చేరువ చేయడం కూడా ‘హుందాగా జీవించడం’ అనే హక్కులో భాగమే. తనకు బలవంతంగా బతకడం ఇష్టంలేదని కోలుకునే అవకాశంలేని వ్యాధితో బాధపడుతున్న వారు ముందుగా రాసుకున్న వీలునామాను అనుమతించకపోవడమంటే... ‘జీవించే హక్కు’ను ఉల్లంఘించినట్లే! జీవితానికి అర్థం, పరమార్థం ఉందన్నది నిజం. అయితే, కోలుకోలేని పరిస్థితుల్లో, చావు - బతుకు మధ్య ఊగిసలాడుతున్నప్పుడు... ఆ రోగి ఇష్టాన్ని గౌరవించడమే సముచితం. - సుప్రీంకోర్టు
 
వారి కోసమే ఈ తీర్పు
క్రానిక్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వ్యాధులు ఉన్న వారికి సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుంది. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడేవారి సమస్యలకు విరుగుడు ఉండదు. ఈ వ్యాధులు ఒకస్థాయికి వచ్చిన తర్వాత మనిషిని కుంగదీస్తాయి. ఎంత వైద్యం చేయించుకున్నా మంచంపైనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో... ఆర్థిక స్తోమత లేని వారు, నిరాదరణకు గురైన వారు స్వచ్ఛందంగా చనిపోవాలనుకుంటారు. ఇప్పుడున్న నిబంధనలు అందుకు అంగీకరించవు. ఇలాంటి వారికి సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుంది.
- డాక్టర్‌ సమరం, విజయవాడ
 
వెంటిలేటర్‌ వద్దనే వారున్నారు
దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు చాలా మంది కారుణ్య మరణం కోరుకుంటున్నారు. కొంతమందైతే వెంటలేటర్‌ తొలగించమని చెబుతున్నారు. అటువంటి వాళ్ల కోసమే ఈ తీర్పు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలపై మరింత స్పష్టత రావాలి!
- డాక్టర్‌ జగన్మోహన్‌, గ్యాస్ర్టోఎంట్రాలజిస్ట్‌, విజయవాడ