రేపు పల్స్‌ పోలియో

35 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు
22,768 కేంద్రాలు.. 52 లక్షల డోసులు సిద్ధం

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న (ఆదివారం) పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల దగ్గర్నించి 5ఏళ్లలోపు చిన్నారుల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏటా రెండుసార్లు పోలియో చుక్కలు వేస్తుండగా.. ఈ ఏడాది ఒకేమారు వేయనున్నారు. దేశంలో గత 8ఏళ్లుగా ఎక్కడా పోలియో కేసులు నమోదు కాకపోయినా.. మన రాష్ట్రంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది చిన్నారులకు 22,768 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకు మొత్తం 52 లక్షల డోసులు సిద్ధం చేశారు. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం 737 ట్రాన్సిట్‌ కేంద్రాల ద్వారా అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కూడళ్లలో పోలియో చుక్కలు వేసే ఏర్పాట్లు చేశారు. 10వ తేదీ తర్వాత రెండు రోజులపాటు బృందాలు ప్రతి ఇంటినీ సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.