కేన్సర్‌ ఔషధాల ధరలు 87 శాతం తగ్గింపు

రోగులకు ఏటా రూ.800 కోట్లు ఆదా : కేంద్రం
 
న్యూఢిల్లీ, మార్చి 8: కేన్సర్‌ రోగులు వాడే 390 బ్రాండ్లకు చెందిన నాన్‌ షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలను 87 శాతం మేర తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు రసాయనాలు, ఎరువుల శాఖ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తక్షణమే తగ్గిన ధరలను అమల్లోకి తేవాలంటూ ఔషధ ఉత్పత్తి సంస్థలు, ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో 22 లక్షల మంది కేన్సర్‌ రోగులకు ఏటా దాదాపు రూ.800 కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం తెలిపింది. 38 బ్రాండ్ల కేన్సర్‌ ఔషధాల ధరలు 75 శాతం మేర తగ్గగా, 124 బ్రాండ్ల ధరలు 50-75 శాతం, 121 బ్రాండ్ల ధరలు 25-50 శాతం, 107 బ్రాండ్ల ధరలు 25 శాతం తగ్గినట్లు పేర్కొంది.
 
మొత్తం 426 బ్రాండ్ల నాన్‌ షెడ్యూల్డ్‌ కేన్సర్‌ ఔషధాలు ఉండగా, వాటిలో 91 శాతం(390) బ్రాండ్ల ధరలను తగ్గించినట్లు వివరించింది. 42 రకాల కేన్సర్‌ నిరోధక మూల ఔషధాల(డ్రగ్‌)పై ట్రేడ్‌ మార్జిన్‌ 30 శాతానికి మించకూడదని జాతీయ ఔషధ ధరల నిర్ణాయక ప్రాధికార సంస్థ(ఎన్‌పీపీఏ) గతనెల 27న నిర్ణయించింది. ఈమేరకు ఔషధ ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయం వల్లే కేన్సర్‌ ఔషధాల ధరలు దిగివచ్చాయి.