పాపను బతికించరూ..

రోడ్డు ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలిక..
ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో..సాయం కోరుతున్న అమ్మా,నాన్న
శస్త్రచికిత్స ఖర్చును భరించలేని స్థితిలో తల్లిదండ్రులు

విజయవాడ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘ముద్దులొలికే మా చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది...ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది..మా బంగారుతల్లిని బతికించుకునేందుకు మా ఆర్థిక స్తోమత చాలడం లేదు..దయగల దాతలు ఎవరైనా సాయం చేయండి’ ఇదీ ఓ దంపతుల నివేదన. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నివాసముంటున్న చిరుద్యోగి తాడి పార్థసారధి, లక్ష్మి దంపతులకు హరమహేశ్వరి (4) ఒక్కతే కూతురు. రాఖీ పండుగ రోజున తండ్రితో కలిసి బైక్‌పై విజయవాడలోని నాయనమ్మ ఇంటికి వస్తుండగా భద్రాచలం శివార్లలో రోడ్డు ప్రమాదానికి గురైంది. చిన్నారి తలకు బలమైన గాయాలతోపాటు ఎడమ కన్ను దెబ్బతింది. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ రెయిన్‌బో ఆస్పత్రిలో చేర్పించగా సర్జరీ చేయనిదే పాప బతకదని వైద్యులు చెప్పారు. సర్జరీకి రూ.4 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పగా, అంత స్తోమత లేని ఆ తలిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సాయమందించే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. సాయం చేయదలచినవారు 98484 09030 నెంబర్‌కు సంప్రతించడం గానీ, యూనియన్‌బ్యాంక్‌ అక్కౌంట్‌ నెంబర్‌ 329402010112006 (ఐఎఫ్‌ఎస్‌సీకోడ్‌:యుబిఐఎన్‌532941)కు సాయం అందించడం గానీ చేయాలని కోరుతున్నారు.