చనిపోనివ్వండి.. ప్లీజ్‌!

కారుణ్య మరణానికి ఓ మహిళ వినతి
పొత్తికడుపులో కణితితో నరకయాతన
ఆబాధ భరించలేను, బతకాలనీ లేదు
‘తూర్పు’ కలెక్టర్‌ను కలిసి వేడుకోలు
 
కాకినాడ సిటీ, మార్చి 19: ‘‘నయంకాని జబ్బుతో నలిగిపోతున్నాను. ఈ బాధను భరించడం నా వల్ల కావడం లేదు. మరణించడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అంటూ ఓ మహిళ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రాను కలిసి విజ్ఞప్తి చేసింది. తనను కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకొంది. సోమవారం కాకినాడలో కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ ఘటన జరిగింది. పిఠాపురం పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీకి చెందిన పత్తి రామలక్ష్మి (35) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఆమె చాలాకాలంగా ప్రాణాంతక హ్యూజ్‌ ఎబ్‌డోమినో ఫెల్విక్‌ సోలిడ్‌- సిస్టిక్‌ ఓవరియన్‌ మాస్‌(కణితి పెరుగుదల) వ్యాధితో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని కలెక్టర్‌కు ఆమె విన్నవించారు. ‘‘బాధ తట్టుకోలేకపోతున్నాను. బతికి ఉన్నా చేసేది ఏమీ లేదు. దయచేసి చనిపోనివ్వండి’’ అంటూ ఆయనకు దరఖాస్తు అందించారు. ఆ సమయంలో వెంట ఆమె పిల్లలు ఉన్నారు. నిజానికి, రామలక్ష్మిని బతికించుకోవడానికి ఆమె కుటుంబసభ్యులు చేయని ప్రయత్నం లేదు. హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా, రామలక్ష్మి కడుపులో భారీ కణితి ఏర్పడిన విషయం బయటపడింది. ఆ కణితిని తొలగించడానికి రూ. ఐదు లక్షలు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు.
 
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఆమె ఆపరేషన్‌కు లక్ష రూపాయలు మంజూరు అయ్యాయి. మరో నాలుగు లక్షలు అవసరం ఉంది. ఇంతలోనే వ్యాధి తీవ్రతరం కావడంతో రామలక్ష్మి నొప్పి తట్టుకోలేకపోతున్నారు. ఆమె పరిస్థితిపై కలెక్టర్‌ సత్వరం స్పందించారు. రామలక్ష్మికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఎన్టీఆర్‌ వైద్యసేవ అధికారులను ఆయన ఆదేశించారు. ఆమెను కాకినాడ సమీపంలోని హోప్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించనున్నట్టు ఎన్టీఆర్‌ వైద్యసేవల జిల్లా కో ఆర్డినేటర్‌ వీ వరప్రసాద్‌ వెల్లడించారు.