వాటర్‌ బాటిళ్లలో ప్లాస్టిక్‌ కణాలు!

16-03-2018: ప్లాస్టిక్‌ బాటిళ్లలో నీటిని తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఇప్పటికే ప్లాస్టిక్‌ బాటిల్‌ నీటిలో పలు రకాల రసాయనాలు కలుస్తున్నాయని.. అవి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. బాటిల్‌ నీటిలో ప్లాస్టిక్‌ రేణువులు ఉంటున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. 9 దేశాల్లో అమ్ముడవుతున్న 11 బ్రాండ్లకు చెందిన 259 వాటర్‌ బాటిళ్లను పరీక్షించిన ఫ్రెడోనియాలోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌, స్వచ్ఛంద జర్నలిజం సంస్థ ఓఆర్బీ మీడియా పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ప్రతి బాటిల్‌ నీటిలోనూ మైక్రోప్లాస్టిక్‌ ఉంటుందని.. లీటరు నీటిలో 10,390 ప్లాస్టిక్‌ రేణువులు ఉంటున్నాయని పరిశోధకులు వెల్లడించారు. వీటిలో 65శాతం ప్లాస్టిక్‌ రేణువులు.. బాటిళ్లు, మూతలకు సంబంధించిన అణువులేనని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ పరిశోధకులు షెర్రీ మాసన్‌ తెలిపారు. అయితే ప్లాస్టిక్‌ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై కావాల్సినంత సమాచారం లేదని.. దీనివల్ల ఈ బాటిళ్లలోని మైక్రోప్లాస్టిక్‌ ప్రమాదకరం అవునో! కాదో! స్పష్టంగా చెప్పలేమన్నారు.