ఫోన్ కాల్‌కు స్పందించి సాయం చేసిన టీడీపీ ఎమ్మెల్యే

కిడ్నీ బాధితుడికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
ఫోన్‌ కాల్‌కు స్పందించిన యరపతినేని శ్రీనివాసరావు
 
మాచవరం(గుంటూరు జిల్లా): సామాన్యుల కష్టసుఖాలు తెలుసుకొని వారికి ఆర్థికంగా, సామాజికంగా తోడ్పాటునందిస్తున్నారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. తాజాగా మండలంలోని వేమవరానికి చెందిన కిడ్నీ బాధిత కుటుంబానికి ఆర్థికసాయంతోపాటు ఇళ్ల స్థలం మంజూరుకు సిఫార్సు చేశారు. వేమవరం గ్రామానికి చెందిన ఉప్పెళ్లి సుందరరావు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. పిడుగురాళ్ల, గుంటూరులో పలు వైద్యశాలల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. వైద్యుల సూచనలు మేరకు సుందరరావును ఇంటికి తీసుకొచ్చారు.
 
ఇరుగుపొరుగు వారు ఎమ్మెల్యే యరపతినేని చేస్తున్న సాయం గురించి బాధితుడి భార్య దీనమ్మ చెవిన వేయడంతో ఆమె ఎమ్మెల్యే యరపతినేనికి ఫోన్‌ చేసి తన భర్త ఆరోగ్య పరిస్థితిని వివరించింది. స్పందించిన యరపతినేని వేమవరం గ్రామ టీడీపీ నాయకులను ఫోన్లో సంప్రదించి సుందరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి సూచనల మేరకు ఎమ్మెల్యే యరపతినేని సుందరరావు భార్య దీనమ్మకు ఆదివారం రూ. 10 వేల ఆర్థిక సాయంతోపాటు రెండు సెంట్ల ఇళ్ల స్థలం మంజూరుకు సిఫార్సు చేశారు.
 
మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ ఏసుపొంగు ఆనందరావు, స్థానిక సర్పంచ్‌ షేక్‌ మాబు సుభాని, పంపనేటి పుల్లయ్య, పొలగాని శివ, పూతల సత్యనారాయణ, రోళ్ల సాంబశివరావు, మోమిన్‌ దరియాసాహెబ్‌, గల్లా ఆదాం, గుదె లక్ష్మినారాయణ, గోళ్ల గంగాధర్‌ తదితరులు ఆదివారం బాధిత కుటుంబానికి నగదు అందజేశారు.