‘నెలసరి’ గురించి మాట్లాడుకుందాం!

రుతుక్రమంపై మూఢనమ్మకాలు, అపోహలు

 తెలుగు రాష్ట్రాల్లో శానిటరీ ప్యాడ్స్‌ వాడకం 22.76 శాతమే
 ప్యాడ్స్‌కు దూరంగా 77.24 శాతం మహిళలు
 68.22 శాతం మందికి పాతబట్టలే దిక్కు
 35 శాతం మంది ఒకే బట్టను 3నెలల పాటు..
 గ్రామాలు, బడుల్లో పరిస్థితి మరీ దారుణం
 ఘోషిస్తున్న సీడబ్ల్యూఎస్‌ సర్వే
 ‘‘ప్యాడ్‌ మ్యాన్‌’’ విడుదల నేపథ్యంలో రుతుక్రమంపై చర్చ
 ప్యాడ్స్‌పై 12శాతం జీఎస్టీపై మహిళా సంఘాల ఆగ్రహం
హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తరగతి గదిలోని ఉపాధ్యాయుడు ఒక్కో విద్యార్థి పేరును పిలుస్తూ, హాజరు వేస్తున్నాడు. ‘ప్రజెంట్‌ సార్‌.. ’అన్న ప్రణతి గొంతు విన్న ఆయన ‘‘మూడు రోజులు బడికెందుకు రాలేదు?’’ అని ప్రశ్నించాడు. ప్రణతి మౌనంగా నిల్చునుంది. ‘‘ఏంటి? నిన్నే అడుగుతోంది’ అంటూ గద్దించాడు. తన బాధను బయటకు చెప్పలేని ఆ బాలిక దుఃఖాన్ని పెదవుల వెనుక బిగబట్టింది.
 
ఇది ఆ బాలిక అవస్థ మాత్రమే కాదు.. ఎందరో మహిళలది! నెలసరిపై ఓ అపోహ, దానికి తోడు మూఢనమ్మకాలు! ప్రకృతి సిద్ధంగా జరిగే రుతుక్రమంపై మాట్లాడడం అంటే ఏదో తప్పు చేసినట్టు భావన. బహిరంగంగా మాట్లాడేందుకు బిడియం. రుతుక్రమాన్ని మహిళల ఆరోగ్యం, పునరుత్పత్తి ప్రక్రియ పరంగా కీలక, సహజ ప్రక్రియగా చూడలేని పరిస్థితి. ఇవే అయనను ఆలోచింపజేశాయి. అసలు ప్యాడ్స్‌ను వాడుతున్న మహిళలు తక్కువగా ఉన్నారని, ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులే కారణమని గుర్తించాడు. పరిష్కారం ఆలోచించి పరిశోధనల దిశగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ ప్రయాణంలో ఆయనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. చివరికి తన సతీమణి నుంచీ ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. అయితేనేం.. అత్యంత తక్కువ ధరకే శానిటరీ న్యాప్‌కిన్స్‌ను తయారు చేసి మహిళాలోకానికి అందించే ప్రయత్నంలో సఫలయ్యాడు.
 
ఆయనే తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథం. ఆయన జీవిత గాథ ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన చిత్రమే ‘‘ప్యాడ్‌ మ్యాన్‌’’. అక్షయ్‌కుమర్‌ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. ఆ చిత్ర ఇతివృత్తం స్ఫూర్తితో ఇప్పుడు రుతుస్రావంపై సమాజంలో ఉన్న మూఢనమ్మకాలతో పాటు పారిశుధ్య సమస్యలపై కొత్త చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నెలసరి సమయాల్లో బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న అవస్థలు, వీటిపై జరిగిన పరిశోధనల్లో తేలిన అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి.
న్యాప్‌కిన్‌లుగా గోనె సంచులు, బ్యాగులు
ఓ మహిళ జీవితంలో రుతుక్రమం ప్రారంభం నుంచి మెనోపాజ్‌ వరకు దాదాపు 6,800 ప్యాడ్స్‌ అవసరమవుతాయని అంచనా. అయితే, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల శానిటరీ న్యాప్‌కిన్స్‌ కొనలేని పరిస్థితే కాదు... అసలు అవి అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. కొన్నాళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ సంస్థ(సీడబ్ల్యూఎస్‌) 20 స్వచ్ఛంద సంస్థలతో కలిసి క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించింది. అందులో వెల్లడైన వాస్తవాలు ఉలికిపాటుకు గురిచేసేలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌, అనంతపురం, కడప, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు నెలసరి సమయాల్లో పాతగోనె సంచులు, పాలిథీన్‌ బ్యాగ్‌లను ప్యాడ్‌గా ఉపయోగిస్తున్నారని తేలింది. మరికొన్ని గ్రామాల్లో వరి పొట్టుకూర్చి కుట్టిన గోనెసంచి ముక్కలను ప్యాడ్స్‌గా వాడుతున్నారని తెలిసింది.
 
మొత్తంగా మహిళల్లో 68.22 శాతం మంది పాత బట్టలనే న్యాప్‌కిన్స్‌గా ఉపయోగిస్తున్నారు. అందులోనూ 35 శాతం అదే పాతబట్టను 3నెలల దాకా, 8.44 శాతం మంది 6 నెలల పాటు వాడుతున్నట్టు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో 77.24 శాతం మంది శానిటరీ న్యాప్‌కిన్స్‌ వాడకానికి దూరంగా ఉన్నట్లు సీడబ్ల్యూఎస్‌ అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 22.76 శాతం మాత్రమే శానిటరీ న్యాప్‌కిన్స్‌ను ఉపయోగిస్తున్నారు.
 
తెలంగాణలోని ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో 53.25 శాతం శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందుబాటులో లేవని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. నల్లగొండ జిల్లాలో 38.37 శాతం, కరీంనగర్‌లో 41.34శాతం, మహబూబ్‌నగర్‌లో 51.82 శాతం, మెదక్‌లో 42.4శాతం, వరంగల్‌ జిల్లాలో 42 శాతం మాత్రమే శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని మహిళల్లోనూ చాలామంది నెలసరి సమయంలో పాతబట్టలను ప్యాడ్స్‌గా వాడుతున్నారని సీడబ్ల్యూఎస్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సుచరిత చెప్పారు.
 
పాఠశాలల్లో మరీ అధ్వానం
విద్యార్థినులు నెలసరి సమయాల్లో విశ్రాంతి తీసుకునేందుకు, శానిటరీ ప్యాడ్స్‌ మార్చుకునేందుకు అనువుగా ఒక్క బడిలోనూ ప్రత్యేక సౌకర్యం లేదు. ఉన్నత పాఠశాలల్లో ‘‘గర్ల్‌ ఫ్రెండ్లీ’’ టాయిలెట్స్‌ నిర్మించాలని మార్గదర్శకాలు ఉన్నా..ఏ పాఠశాలలోనూ అలాంటి టాయిలెట్‌ ఒక్కటికూడా కనిపించదని విద్యావేత్తలు చెబుతున్నారు. గ్రామీణ, మారుమూల పల్లెల్లో ప్యాడ్‌ అందుబాటులో లేని విద్యార్థినులు చాలామంది ఆ మూడు రోజులు బడికి దూరమవుతున్నారని పలు స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతున్నాయి.
 
న్యాప్‌కిన్స్‌ వాడకంపై పలు విమర్శలు
మార్కెట్లో వస్తున్న శానిటరీ న్యాప్‌కిన్స్‌ వాడకంపై పలు విమర్శలున్నాయి. అయితే, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కాటన్‌ బట్టను ప్యాడ్‌గా ఉపయోగించమని ప్ర చారం చేస్తున్నాయి. అది మంచి పద్ధతే. అయితే, గోనెసంచులు, పాతబట్టలు వం టివి ఉపయోగించడం వల్ల ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ మూసుకుపోయే ప్రమాదం ఉంది. బట్టను రెండు సార్లు కన్నా ఎక్కువ ఉపయోగించకూడదు.

డాక్టర్‌ బాలాంబ, ప్రముఖ గైనకాలజిస్ట్‌

ప్యాడ్స్‌ అందుబాటు ధరల్లో ఉండాలి
సమాజంలో రుతుక్రమంపై ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. అవన్నీ పోవాలంటే, ముందుగా మౌనం వీడాలి. నెలసరి అనేది సహజమైన ప్రక్రియ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నగరాల్లోనూ కొంత మంది మహిళలు ప్యాడ్‌ల వాడకానికి దూరంగా ఉంటున్నారు. ఎకో శానిటరీ ప్యాడ్స్‌ తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాలలో బాలికలకు శానిటరీ ప్యాడ్స్‌ను ఉచితంగా అందించాలి.
 
సుచరిత, డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ సంస్థ,

తెలంగాణ రీసోర్స్‌ సెంటర్‌

బయో డీగ్రేడబుల్‌ ప్యాడ్స్‌ అవసరం
మహిళల కనీస అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్స్‌పై 12శాతం జీఎస్టీ విధించడం ఎంత వరకు సమంజసం? ప్యాడ్స్‌ వాడకంలో ఉన్న అపోహలు, వాటిని కొనుగోలు చేసే సామర్థ్యం వంటి అంశాలపై సమగ్ర చర్చ జరగాలి. ఉపయోగించిన ప్యాడ్స్‌ను ఎక్కడ పడేయాలన్నది పెద్ద ప్రశ్న. వాటిని కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుంది. అందుకే బయోడీ గ్రేడబుల్‌ శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులోకి తేవాలి.
 సుధ గోపరాజు,
పారిశుధ్య సమస్యపై పనిచేస్తున్న కార్యకర్త