గైనకాలజిస్టు కాకున్నా ఆపరేషన్లు

ఎంసీహెచ్‌ నుంచి సొంత ఆస్పత్రికి పేషెంట్ల తరలింపు
‘ఆంధ్ర జ్యోతి కథనం’తో మహిళా డాక్టర్‌ బండారం బట్టబయలు
డీఎంహెచ్‌వో తనిఖీల్లో వెలుగు చూసిన నిజాలు

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 16: ఆ వైద్యురాలు ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు తప్ప, గైనకాలజీలో ఎటువంటి ప్రత్యేక కోర్సు చదవలేదు. అయినా గైనకాలజిస్టుగా ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా చేస్తూ.. తన ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌కు రోగులను తరలిస్తూ వచ్చారు. డీఎంహెచ్‌వో తనిఖీల్లో జనగామ మాతాశిశు కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్‌ ఛాయాదేవి బండారం బట్టబయలైంది. ఈ నెల 15న ఆంధ్రజ్యోతిలో ‘సొంత నర్సింగ్‌హోంకు పేషెంట్ల రెఫర్‌’ శీర్షికన ప్రచురితమైన కథనంతో జిల్లా వైద్యాధికారులు కదిలారు. డీఎంహెచ్‌వో మహేందర్‌ శనివారం విచారణకు ఆదేశించడంతో పాటు ఛాయాదేవి ప్రైవేటు ఆస్పత్రిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు విషయాలు వెలుగుచూశాయి. ఎంబీబీఎస్‌ చదివిన ఛాయ, కొంతకాలం పాటు ఏరియా ఆస్పత్రిలో పని చేయగా, ప్రస్తుతం ఎంసీహెచ్‌లో పనిచేస్తున్నారు. ఎంసీహెచ్‌ ఔట్‌పేషెంట్‌ విభాగంలో పరీక్షలు చేయించుకున్న పలువురు గర్భిణులు ఛాయాదేవి సొంత ఆస్పత్రిలో ఉండడంతో తనిఖీ అధికారి ఆశ్చర్యానికి గురయ్యారు. ఛాయాదేవిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి డీఎంహెచ్‌వో, ఆమెపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.