ఈ నెల 14న నిమ్స్‌లో ఆర్థరైటిస్‌పై అవగాహన, స్ర్కీనింగ్‌ క్యాంప్‌

హైదరాబాద్, 12-10-2018: కీళ్ల వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన లేదని, దీంతో వ్యాధి ముదిరిన తరువాత వైద్యుడిని సంప్రదిస్తున్నారని ప్రముఖ రుమటాలజిస్ట్‌ డాక్టర్‌ నర్సింహులు అన్నారు. కీళ్ల వాతాన్ని ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చన్నారు. ఆర్థరైటిపై ఈ నెల 14న రుమటాలజీ అసోసియేషన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో అవగాహన, కీళ్లవాతంపై స్ర్కీనింగ్‌ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో అసోసియేసన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షురాలు, నిమ్స్‌ రుమటాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ లిజా రాజశేఖర్‌, కార్యదర్శి డాక్టర్‌ రాజేంద్ర వరప్రసాద్‌, సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ పీఎస్‌ఆర్‌ గుప్తతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.
 
వయస్సు పైబడిన వారికే ఈ వ్యాధి వస్తుందని, దీనికి మందులు లేవు అనేది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. 5 నుంచి 90 ఏళ్లలోపు వారికి ఎవరికైనా ఈ వ్యాధి రావొచ్చన్నారు. కీళ్ల వద్ద వాపు, పట్టివేయడం, నిద్రలేమి, ఉదయాన్నే 30 నిమిషాల కన్నా ఎక్కువ సేపు కీళ్లు బిగుసుకుపోవడం, కీళ్ల నొప్పులతో పాటు తరచుగా జ్వరం రావడం, చర్మంపై మచ్చలు ఉండడం తదితర సమస్యలతో బాధపడుతుంటే కీళ్ల వాత లక్షణాలుగా గుర్తించాలన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ విజయ ప్రసన్న, డాక్టర్‌ ధీరజ్‌ తదితరులు పాల్గొన్నారు. వివరాలకు 98850 99834 నెంబర్‌లో సంప్రదించవచ్చు.