పీహెచ్‌సీల్లో ఓపీలు బంద్‌

850 మంది కాంట్రాక్ట్‌ వైద్యులు విధులకు దూరం
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న 850 మంది కాంట్రాక్ట్‌ వైద్యులు విధులను బహిష్కరించారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లే ఓపీలను నడిపిస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్‌ వైద్యులు విధులు నిర్వహిస్తున్న పీహెచ్‌సీలు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే, ప్రస్తుతం సమ్మె నోటీసు ఇచ్చినా.. వైద్యులు అత్యవసర కేసులకు హాజరవుతున్నారు. అయితే, ఈ నెల 14లోపు ప్రభుత్వం స్పందించకుంటే పూర్తిగా విధులు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.