ఆస్పత్రుల్లో మందుల్లేవ్‌..

రాబిస్‌ వ్యాక్సిన్‌ కొరత
సీడీఎస్‌ల్లోనూ నో వ్యాక్సిన్‌
సరఫరాలో కార్పొరేషన్‌ విఫలం

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కుక్క కాటు చెప్పు దెబ్బ అనేది సామెత. ప్రస్తుతం రాష్ట్రంలో అదే నిజం అవుతోంది. ఎవరికి కుక్క కరిచినా చెప్పుదెబ్బతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆసుపత్రిలోనూ కుక్క కాటుకు మందు దొరకడం లేదు. ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న బాధితులను వైద్యులు మందులు లేవని తిప్పిపంపిస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయిలతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. సాధారణంగా కుక్క కరిచిన వెంటనే ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే అక్కడ వైద్యులు యాంటి రాబిస్‌ వ్యాక్సిన్‌ అందిస్తారు.

వ్యాక్సిన్‌ వేయకుండా ఎలాంటి వైద్యం అందించినా ఉపయోగం ఉండదు. వ్యాక్సిన్‌ వేయకపోతే ఇన్ఫెక్షన్‌ వచ్చి, ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది. చిన్న చిన్న ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్స్‌లో కూడా అందుబాటులో ఉండే యాంటి రాబిస్‌ వ్యాక్సిన్‌ ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రం అందుబాటు లేదు. బోధనాస్పత్రుల దగ్గర నుంచి పీహెచ్‌సీల వరకూ ఎక్కడా ఈ వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది నుంచే ఈ పరిస్థితి ఉంది. కొరతను భర్తీ చేయడంలో ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. 2నెలల నుంచి పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీడీఎస్‌ (సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌)లో ఒక్క వ్యాక్సిన్‌ కూడా లేదు. దీంతో వైద్యులు కుక్క కాటు బాధితులు వస్తే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
 
ఏపీఎంఎస్‌ఐడీసీ వైఫల్యం
సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రులకు అవసరమైన మందులను ఏపీఎంఎస్‌ఐడీసీ(ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌) సరఫరా చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల నుంచి రోగులకు అవసరమైన మందులను సరఫరా చేయడంలో కార్పొరేషన్‌ పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్‌ కొరతతో అది మరోసారి బయటపడింది. ఏడాది క్రితం నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల నుంచి తమకు రాబిస్‌ వ్యాక్సిన్‌ కొరత ఉంది, వెంటనే సరఫరా చేయాలని కార్పొరేషన్లకు ఇండెంట్లు వస్తున్నాయి. ఆ సమయంలో సీడీఎస్‌లలో ఉన్న కొద్ది మొత్తం వ్యాక్సిన్‌లను సరఫరా చేసిన కార్పొరేషన్‌, వీటితో సరిపెట్టుకోవాలని చెప్పేసింది. ప్రస్తుతం సీడీఎస్‌ల్లో కూడా వ్యాక్సిన్‌ అయిపోవడంతో కార్పొరేషన్‌ అధికారులు చేతులెత్తేశారు. ఇప్పుటికిప్పుడు వ్యాక్సిన్‌ కొనుగోలు చేసి ఆస్పత్రులకు సరఫరా చేసే అవకాశం కూడా లేదు. వ్యాక్సిన్‌ సరఫరా చేయాలంటే కనీసం నెల నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
 
భారీగా పెనాల్టీలు..
మొన్నటి వరకూ యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్‌ను కార్పొరేషన్‌కు భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ ఇమ్యునలాజికల్‌ లిమిటెడ్‌ అనే సంస్థలు సరఫరా చేసేవి. ముఖ్యంగా భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యాక్సిన్‌ను రూ.165 సరఫరా చేసేది. ఇలాంటి సంస్థను కార్పొరేషన్‌ అధికారులు అనేక ఇబ్బందులకు గురి చేసినట్లు సమాచారం. సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ లేటు జరిమానాలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ఆర్డర్‌ ప్రకారం తాము వ్యాక్సిన్‌ సరఫరా చేయలేమని ఆ సంస్థ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
 
3 సార్లు టెండర్లు రద్దు
ప్రస్తుతం రాష్ట్రంలో యాంటి రాబిస్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేసే ఫార్మా కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. రెండు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి కదా, మళ్లీ వాళ్లకే అర్డర్‌ ఇచ్చేస్తే నిబంధనల ప్రకారం సరఫరా చేస్తారులే అన్న ధీమాతో కార్పొరేషన్‌ అధికారులు టెండర్లు పిలవడంలో ఆలస్యం చేశారు. అధికారులు నమ్మకం పెట్టుకున్న సంస్థలు చేతులెత్తేయడంతో మొదటికి మోసం వచ్చింది. వ్యాక్సిన్‌ కోసం ఏడాది క్రితం నుంచి కార్పొరేషన్‌ టెండర్‌ ప్రక్రియ ప్రారంభించింది. ప్రతిసారి టెండర్లు పిలవడం రద్దు చేయడం పరిపాటిగా మారింది. ఏడాది వ్యవధిలో మూడుసార్లు టెండర్లు పిలిచి రద్దు చేశారు. ముందుగా ఊహించనట్లుగానే వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. ఏదిఏమైనా కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.