సీఎం గారి ఇలాకాలో డాక్టర్ లేడు..

డాక్టర్‌ లేడు!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత
40 శాతం పీహెచ్‌సీల్లో డాక్టర్లు లేరు
20 శాతం ఆస్పత్రుల్లో నియామకాలే లేవు
మరికొన్ని పీహెచ్‌సీలకు డాక్టర్లు దూరం
ఏడాదిగా ఒక్క వైద్యుడూ రాని ఆస్పత్రులెన్నో
కేసీఆర్‌ సొంతూరు చింతమడకలోనూ ఇంతే!
తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రజలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పల్లె ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. తెలంగాణలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 1000 పీహెచ్‌సీలున్నాయి. వీటిలో పది వరకు 30 పడకల ఆస్పత్రులు కాగా మిగతావన్నీ ఆరు పడకల ఆస్పత్రులు. రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. వీటిలో 20 శాతం పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 20 శాతం పీహెచ్‌సీల్లో డాక్టర్లను నియమించినా వారు వెళ్లడం లేదు. కొంతమంది పోస్టింగ్స్‌ తీసుకున్నారు. కానీ, చేరలేదు. దాంతో, వాటికి సమీపంలోని పీహెచ్‌సీల్లో పని చేస్తున్న డాక్టర్లను ఇన్‌చార్జిలుగా వేస్తున్నారు. వారు కూడా రెండుచోట్ల పనిచేయలేక ఒక పీహెచ్‌సీకే మొగ్గు చూపుతున్నారు.

ఉదాహరణకు, సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి పీహెచ్‌సీలో ఏడాది కాలంగా వైద్యులు లేరు. ఈ పీహెచ్‌సీ పరిధిలో 22 గ్రామాలు, 9 తండాలు ఉన్నాయి. రోజుకు 12 గంటలపాటు నడవాల్సిన ఆస్పత్రి.. డాక్టర్లు లేక ఒకే ఒక్క స్టాఫ్‌ నర్స్‌తో నడుస్తోంది. దీంతో, రోగులు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి వెళ్తున్నారు.
 
వైద్యులను నియమించాలని స్థానిక డీఎంహెచ్‌వోకి స్థానిక ప్రజాప్రతినిధులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఉపయోగం లేకపోయింది. ఇక్కడ రెండు రెగ్యులర్‌ డాక్టర్‌ పోస్టులుంటే ఒక్క డాక్టర్‌ కూడా లేరు. దీంతో ఈ పీహెచ్‌సీకి తాళం వేసే పరిస్థితి వచ్చింది. వైద్యుల కొరత కారణంగా క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందడం లేదు. స్థానికంగా సర్కారీ వైద్యులు లేకపోవడంతో ప్రజలు ఆర్‌ఎంపీ వైద్యులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్నిసార్లు వ్యాధుల తీవ్రత పెరిగి మరణాల వరకూ దారితీస్తోంది.
  
పరిష్కారం ఇలా..
పీహెచ్‌సీల్లో ఎంబీబీఎస్‌ వైద్యులను నియమిస్తుండడంతో పీజీ సీటు రాగానే వారు ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. మరికొందరు కోరుకున్నచోట పోస్టింగ్‌ రాక చేరడం లేదు. ఈ సమస్యను అధిగమించాలంటే పీహెచ్‌సీల్లో నియమించే ఇద్దరు వైద్యుల్లో ఒకరు కమ్యూనిటీ మెడిసిన్‌ చేసిన వారిని, మరొకరు ఫ్యామిలీ మెడిసిన్‌ చేసిన వారిని నియమించాలి. వారైతేనే పీహెచ్‌సీల్లో ఉండి సేవలందిస్తారు.
 
రాష్ట్రంలోని కొన్ని పీహెచ్‌సీల్లో పరిస్థితులివి..
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని పైడిపల్లి, సిద్దాపూర్‌, కొండపర్తి పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందుబాటులో లేవు. ఇక్కడ వైద్య సిబ్బంది లేరు. ఉన్న వైద్యులు కాస్తా కంటి వెలుగులో పాల్గొంటున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు పీహెచ్‌సీలో గత 6 నెలలుగా వైద్యుడు లేరు.
మహబూబాబాద్‌ జిల్లా మల్యాల పీహెచ్‌సీలో వైద్యులు లేరు.
సంగారెడ్డి జిల్లాలో 29 పీహెచ్‌సీలుండగా మొగుడంపల్లి, జహీరాబాద్‌ మండలం మల్చెల్మ పీహెచ్‌సీల్లో ఒక్క డాక్టర్‌ కూడా అందుబాటులో లేరు.
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్‌, సిర్పూరు (యూ), సిర్పూరు (టీ) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క వైద్యుడూ లేడు.
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని పెగడపల్లి పీహెచ్‌సీకి వైద్యుడిని నియమించలేదు. నవీపేటలోని బినోలా పీహెచ్‌సీలో ఒక్క డాక్టర్‌నీ నియమించలేదు.
సూర్యాపేట జిల్లాలోని నూతనకల్‌, ఆత్మకూర్‌ ఎస్‌, తిరుమలగిరి పీహెచ్‌సీల్లో వైద్యులు లేరు.
కామారెడ్డి జిల్లా హన్మాజీపేట, నిజాంసాగర్‌, డొంగ్లీ, పిట్లం పీహెచ్‌సీల్లో ఒక్క వైద్యుడూ లేడు. ఇక్కడి ప్రజలు దూరాన ఉన్న బాన్స్‌వాడ, కామారెడ్డి ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్తాయాల పీహెచ్‌సీ ప్రారంభమై మూడేళ్లు అవుతున్నా ఒక్క డాక్టర్ని కూడా నియమించలేదు.
 
ఖాళీలు ఉన్న మాట వాస్తవమే
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవమే. ఆ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టాం. వీలైనంత త్వరగా వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టులు ఖాళీలున్నచోట కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను తీసుకున్నాం. నర్సుల నియామకాల ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ చూస్తోంది. అది కోర్టు కేసులో ఉంది.
- డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు