ఉస్మానియా వైద్యుల వినూత్న నిరసన

హైదరాబాద్, 08-09-2018: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆస్పత్రి కొత్త భవనం నిర్మించాలంటూ వైద్యులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వైద్యులు హెల్మెట్లు ధరించి వైద్యం అందజేశారు. ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో తరచూ పెచ్చులు ఉడుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్మెట్లు ధరించి రోగులకు సేవలందించారు. పెచ్చూలూడటంతో రోగులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోందని వారు తెలిపారు. పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని వైద్యులు గుర్తుచేశారు.