డెంగ్యూతో తల్లి, పురిటిబిడ్డ మృతి

అరగంట వ్యవధిలో ఇద్దరూ కన్నుమూత
గరివిడి, ఆగస్టు13: డెంగ్యూతో తల్లి, పురిటిబిడ్డ మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉదరపల్లి జానకి(23) ఎనిమిది నెలల గర్భిణి. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెను గత సోమవారం రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే జానకి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు విశాఖ కేజీహెచ్‌కి అదే రోజు రాత్రి తరలించారు. ఆమెకు డెంగ్యూ సోకిందని, రక్తకణాలు బాగా తక్కువగా ఉన్నాయని గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. అయినా ఆదివారం నాటికి పరిస్థితి విషమించింది. ఆపరేషన్‌ చేసి బిడ్డను తీసేస్తే మంచిదని, లేకుంటే బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. భర్త అంగీకరించడంతో ఆపరేషన్‌ చేశారు. కాగా, పుట్టిన మగబిడ్డ అరగంట తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాధలో ఉండగానే జానకి కూడా అరగంట వ్యవధిలో ప్రాణాలు కోల్పోయింది.