విశాఖలో లక్షల మందికి జ్వరాలు

‘దోమలపై దండ యాత్ర’ అట్టర్‌ ఫ్లాప్‌: విష్ణు
గుజరాత్‌ కంటే ఏపీలోనే డెంగీ కేసులు తక్కువ: గణేష్‌

11-09-2018:రాష్ట్రంలో జ్వరాల బెడద తీవ్రంగా ఉందని, ఒక్క విశాఖపట్నంలోనే లక్షల మంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని బీజేపీ పక్ష నాయకుడు విష్ణుకుమార్‌ రాజు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడు కూడా జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దోమల బెడద తీవ్రంగా ఉందని, ప్రభుత్వం చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమం అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని విమర్శించారు. కేజీహెచ్‌లో పరిస్థితి దారుణంగా ఉందని, దీనిని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకోవాలని సూచించారు. తాను చెప్పింది అక్షర సత్యమని, కావాలంటే సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక చూడాలని చెప్పారు. విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలపై వాసుపల్లి గణేష్‌ స్పందించారు. ప్రజల్లో భయాందోళన పెంచడానికే బీజేపీ నేతలు అలా మాట్లాడుతున్నారని అన్నారు. సీజనల్‌ వ్యాధులు సర్వసాధారణమని చెప్పారు. గుజరాత్‌లో 600 డెంగీ కేసులు నమోదయితే... ఏపీలో 200 మాత్రమే నమోదవుతున్నాయని చెప్పారు. అవి కూడా తగ్గించడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. జ్వరాల నియంత్రణకు ఆరోగ్య, మునిసిపల్‌ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు. మునిసిపాలిటీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రూ.30 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.