మురికివాడల్లో 6700 మందికి వైద్య సేవలు

రాష్ట్రవ్యాప్తంగా 13 ఆరోగ్య శిబిరాల్లో నిర్వహణ
తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం

హైదరాబాద్‌, ఖైరతాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. రాష్ట్రంలో గుర్తించిన, గుర్తింపునకు నోచుకోని మురికివాడలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, వాటిల్లో నివసిస్తున్న ప్రజలకు తీవ్రస్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మురికివాడల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలంటూ లీగల్‌ సెల్‌ అథారిటీ తెలంగాణ యాక్టింగ్‌ ఛీఫ్‌ జస్టిస్‌, తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 శిబిరాల్లో 214 మంది వైద్యలు.. 6,704 మందికి ఉచిత వైద్య సేవలను అందించారు. వారికి అవసరమైన పరీక్షలను నిర్వహించారు. మందులను పంపిణీ చేశారు. కాగా మహానగర న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎంఎ్‌సమక్తా కమ్యూనిటీహాల్‌ వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.

కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ విభాగాలకు చెందిన వైద్యులు వందలాది మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సన్‌షైన్‌ ఆస్పత్రుల సహకారంతో జరిగిన ఈ శిబిరాన్ని మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌, సెషన్స్‌ జడ్జి తుకారాంజీ, ఇతర న్యాయమూర్తులు, నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంజనీకుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు.