లివర్‌ లాకర్‌!

అందుబాటులోకి నార్మో థర్మిక్‌ లివర్‌ పర్ఫ్యూషన్‌ టెక్నాలజీ యంత్రం
కాలేయానికి 24 గంటల రక్ష... యశోద ఆస్పత్రిలో ఏర్పాటు
హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అవయవ మార్పిడి చేయాలంటే 3 లేదా 4 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు. దాత నుంచి వేరు చేసిన అవయవాన్ని వీలైనంత తక్కువ సమయంలో గ్రహీతకు అమర్చాలి. లేకపోతే, అవయవాలు చెడిపోతాయి. ఇక నుంచి ఈ బాధలకు విముక్తి కలగనుంది. అవయవాలను ఎలాంటి సమస్య లేకుండా భద్రపరుచుకొనేందుకు వీలయ్యే యంత్రాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతానికి కాలేయాన్ని 24 గంటల పాటు భద్రపర్చుకొనే యంత్రం యశోద ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. దాని సహాయంతో దాత నుంచి సేకరించిన అవయవాన్ని పరీక్షలు చేసి, 24 గంటల లోపు ఎప్పుడైనా గ్రహీతకు అమర్చవచ్చు.
 
ఆ యంత్రం పేరే.. ‘నార్మో థర్మిక్‌ లివర్‌ పర్ఫ్యూషన్‌ టెక్నాలజీ’. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఎండీ జీఎస్‌ రావు దాని విశేషాలను వివరించారు. గుండెపోటుతో మరణించిన వారి కాలేయాన్ని కూడా ఈ యంత్రంలో 24 గంటల పాటు భద్రంగా దాచవచ్చని తెలిపారు. కాలేయ మార్పిడి అయ్యే వైద్య ఖర్చులు కాకుండా, దాని నిల్వకు అదనంగా నాలుగైదు లక్షలు అవుతుందని వైద్యులు వివరించారు.
 
ప్రస్తుతం కాలేయాన్ని నిల్వ చేసే యంత్రం మాత్రమే అందుబాటులోకి వచ్చిందని మున్ముందు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల తదితర అవయవాలను భద్ర పర్చే యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. ఈ యంత్రాలు అందుబాటులోకి వస్తే ఎక్కువ మందికి అవయవ మార్పిడి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ పద్ధతి ద్వారా ఆస్పత్రిలో ఇప్పటికే ముగ్గురికి కాలేయ మార్పిడి చేసినట్లు వెల్లడించారు.