పసివారిపై ప్రాణాంతక వ్యాధి పంజా

ముగ్గురు చిన్నారులకు కాలేయ వ్యాధి

ఆపరేషన్‌కు ఒక్కొక్కరికీ 30 లక్షలవుతుందన్న వైద్యులు
ప్రాణభిక్ష పెట్టాలంటూ తల్లిదండ్రుల వేడుకోలు

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 12: తమకు వచ్చిన వ్యాధి ఏమిటో కూడా తెలియని చిన్నారులను మృత్యువు వెంటాడుతోంది. ఆ విషయం తెలియని ఆ పసిపిల్లలు ఆటపాటలతో కాలం గడుపుతున్నా... ఆ ఆనందం తాత్కాలికమేనన్న కఠిన నిజం తెలిసిన పేద తల్లిదండ్రులు భగవంతుడిపై భారంవేసి ఆదుకునే వారికోసం ఎదురుచూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ఇస్మాయిల్‌ నగర్‌కు చెందిన అమర్తి వెంకన్న, చిన్న దంపతులకు ఏడేళ్ల కుమారుడు దుర్గాప్రసాద్‌, నాలుగేళ్ల లక్ష్మి, ఏడాది వయసున్న మార్త ఉన్నారు. దుర్గాప్రసాద్‌కు మూడేళ్ల వయసులో పొట్ట పెరుగుతూ వచ్చింది.
 
ఎదిగే క్రమంలో పొట్ట పెరుగుతుందని స్థానిక వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. వయసు పెరిగే కొద్దీ అతడికి పొట్ట పెరుగుతూ రావడం తల్లిదండ్రులను కలవరపెట్టింది. చిన్నపిల్లల వైద్యులను సంప్రదించగా... కాలేయ సమస్య ఉండొచ్చని, పరీక్షలకు హైదరాబాద్‌ లేదా విశాఖపట్నం తీసుకెళ్లమని సూచించారు. దాంతో తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా కాలేయ సంబంధిత వ్యాధిగా తేలింది. ఆపరేషన్‌ చేయించకపోతే చనిపోతాడని ఆపరేషన్‌కు రూ.30 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. కూలి పనులు చేసుకునే తమకు అంత మొత్తం తీసుకురావడం కలలో కూడా సాధ్యంకాదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను కలిసి సమస్యను విన్నవించారు.
 
ఆయన స్పందించి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రూ.15 లక్షలు మంజూరు చేయించారు. వైద్యానికి నిధులు సరిపోని కారణంగా కాకినాడ ఎంపీ తోట నరసింహాన్ని కలిసి సమస్యను చెప్పారు. స్పందించిన ఆయన పీఎం రిలీఫ్‌ ఫండ్‌లో రూ.5 లక్షలు మంజూరు చేయించారు. ఈ రెండు పత్రాలను పట్టుకుని కుమారుడితో తల్లిదండ్రులు హైదరాబాద్‌ వెళ్లారు. కేర్‌, కిమ్స్‌, అపోలో వంటి ఆసుపత్రులలో వైద్యులను కలిసి పరిస్థితిని వివరించారు. అయితే సీఎంరిలీఫ్‌ ఫండ్‌ మంజూరు పత్రాలు కాకుండా నగదు తీసుకురావాలని, ఆపరేషనుకు రూ.25 లక్షలు, పరీక్షలకు రూ.5 లక్షలు అవుతుందని వైద్యులు చెప్పారు.
 
మరోవైపు.. కుమారుడి మాదిరిగానే ఇద్దరు ఆడపిల్లలకూ పొట్టలు పెరుగుతున్నాయని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు చూపించారు. ఒక్కరి వైద్యానికే ముప్పై లక్షలైతే, ముగ్గురికి సుమారు తొంభై లక్షలు ఖర్చు అవుతుందని.. ఇంత సొమ్ము ఎలా తేగలమని గుండెలవిసేలా రోదించారు. ప్రజావాణిలో మూడుసార్లు కలెక్టర్‌ను కలిసి తమ సమస్య విన్నవించామని, అయినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పిల్లలకు ప్రాణభిక్ష పెట్టాలని వారు దాతలను కోరుతున్నారు.