మహిళలకే ఎక్కువ ఆయుష్షు!

పురుషులతో పోలిస్తే 4.4 ఏళ్లు అధికం..
మగవారి కనీస ఆయుర్దాయం 69.8 ఏళ్లు
ఆడవారి కనీస ఆయుర్దాయం 74.2 ఏళ్లు
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం బతుకుతారట. మగవారు సగటున 69.8 ఏళ్లు జీవించగా, ఆడవారు సగటున 74.2 ఏళ్లు జీవిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజా అధ్యయనంలో తేలింది. అంటే.. పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం 4.4 ఏళ్లు ఎక్కువ అన్నమాట. పొగ తాగడం, మద్యం సేవించడం, ప్రమాదకరమైన పనులు చేయడం, హింసలకు పాల్పడటంతో పాటు మానసిక ఒత్తిడి ఇందుకు కారణమని వెల్లడైంది. వీటితో పాటు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, కేన్సర్‌, లివర్‌ సమస్యలతో పురుషులు ఎక్కువగా మరణిస్తారని, ఈ సమస్యలు మహిళల్లో తక్కువేనని పేర్కొంది. జీవిత కాలాన్ని తగ్గించే ముఖ్యమైన 40 జబ్బుల్లో 33 పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది. కాగా, 2019లో ప్రపంచవ్యాప్తంగా 14.1 కోట్ల మంది శిశువులు జన్మిస్తారని అంచనా వేయగా.. అందులో 7.3కోట్లు మగ, 6.8కోట్ల ఆడ శిశువులు జన్మిస్తారని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. ప్రస్తుతం ప్రతి 105-110 మంది మగ పిల్లలకు 100 మంది ఆడ పిల్లలు ఉండగా.. శిశు మరణాల్లో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

పెరిగిన సగటు ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయుర్దాయం గత పదహారేళ్లలో సగటున 5.5 ఏళ్లు పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంలో వెల్లడైంది. 2000 సంవత్సరంలో సగ టు ఆయుర్దాయం 66.5 ఏళ్లు ఉండగా.. 2016 నాటికి అది 72కు పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అలాగే ఆరోగ్యకర జీవితం కొనసాగించడంలో 2000లో 58.5 ఏళ్లుగా ఉండగా.. అది 2016 నాటికి 63.3కు చేరుకున్నట్లు తెలిపింది. ఆయుర్దాయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఉంటే.. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అత్యల్ప ఆదాయం కలిగిన దేశాల్లో ప్రతి 14 మంది శిశువుల్లో.. ఐదేళ్ల వయసు నాటికి ఒకరు చనిపోతున్నట్లు తెలిసింది