నిలబడి పనిచేసుకుందాం..!

‘యాపిల్‌’ ఉద్యోగులకు స్టాండింగ్‌ డెస్క్‌లు
సిట్టింగ్‌.. కేన్సర్‌ వంటిదంటున్న ‘యాపిల్‌’ సీఈఓ

18-06-2018: ఆఫీస్‌లో ఎలా పనిచేస్తున్నారు? ఇంకెలా, కుర్చీలో కూర్చొనే కదా అంటారా! కానీ ప్రఖ్యాత యాపిల్‌ కంపెనీలో.. సిట్టింగ్‌ సెటప్‌ మొత్తం మార్చేశారు. సాంతా క్లారా వ్యాలీలోని 175 ఎకరాల యాపిల్‌ క్యాంపస్‌లో..ఉద్యోగుల కోసం స్టాండింగ్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

‘మా ఉద్యోగులందరికీ నూరు శాతం స్టాండింగ్‌ డెస్క్‌లను అందించాం. ఆఫీసులో కాసేపు నిల్చొని, తర్వాత కూర్చోవచ్చు. మళ్లీ నిలబడి తిరిగి కూర్చోవచ్చు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇది తోడ్పడుతుంది’ అని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాదు ఎక్కువసేపు కూర్చొని పని చేయడం కొత్త తరహా కేన్సర్‌ వంటిదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అభ్యర్థులను తనతోబాటు కాసేపు నిలబడాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ‘ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం మంచిదికాదు. సిట్టింగ్‌..కొత్త తరహా కేన్సర్‌ వంటిదని డాక్టర్లు చెబుతున్నారు’ అని టిమ్‌ కుక్‌ వ్యాఖ్యానించారు. యాపిల్‌ పార్కులో ఇప్పటికే లక్ష చదరపు అడుగుల ఫిట్‌నెస్‌ సెంటర్‌ ఉంది. క్యాంపస్‌లో ఒక్కో డెస్క్‌ చైర్‌ ఏర్పాటుకు దాదాపు రూ.81 వేలు ఖర్చయిందని అంచనా!
 
స్టాండింగ్‌ డెస్క్‌తో ఉపయోగాలు
టైప్‌-2 డయాబెటిస్‌, స్థూలకాయం ముప్పును తగ్గిస్తుంది
వెన్ను నొప్పి నుంచి కాస్త రిలీఫ్‌
గుండె వ్యాధులు, కేన్సర్‌ ముప్పు తగ్గుతుంది.
స్టాండింగ్‌ డెస్క్‌తో ఉద్యోగుల్లో ఉత్సాహం నిండుతుంది.