కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 19: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో లైవ్‌ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన 24 ఏళ్ల రామాంజనేయులుకు సోమవారం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్‌ డాక్టర్‌ ఏవీఎస్‌ రెడ్డి, హైదరాబాదుకు చెందిన డాక్టర్‌ సూర్యప్రకాష్‌, నెఫ్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ జిక్కి, యూరాలజీ హెచ్‌వోడీ విభాగపు హెచ్‌వోడీ ఎ.భగవాన్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీతారామయ్య, అనస్థీషియా హెచ్‌వోడీ కైలా్‌షనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. 9 గంటలకు ప్రారంభమైన ఈ శస్త్రచికిత్స మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. రాయలసీమలో మొట్టమొదటిసారిగా చేసిన ఈ ఆపరేషన్‌ను కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోని ధన్వంతరీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వీర పాండియన్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అయినట్టు ప్రకటించారు. దాదాపు 20 మంది వైద్యులు శస్త్రచికిత్సను నిర్వహించారని వెల్లడించారు. అనంతరం శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను కలెక్టర్‌ సన్మానించారు.