కడుపు నొప్పని వెళితే.. కిడ్నీ మాయం

రహదారిపై బాధిత బంధువుల ఆందోళన.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘటన

డిండి, సెప్టెంబరు 4: కడుపు నొప్పిని వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే బాధితుడికి తెలియకుండానే కిడ్నీని మాయం చేశారు ‘ప్రైవేటు’ వైద్యులు. నొప్పి మళ్లీ తిరగబెట్టడంతో చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళితే ఒక కిడ్నీనే లేదని వైద్యులు చెప్పడంతో బాధిత బంధువులు మంగళవారం హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బాధితుల కథనం మేరకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం ఉమ్మాపురానికిచెందిన బన్నె బుచ్చయ్యకు పదేళ్ల క్రితం కడుపునొప్పి రావడంతో అచ్చంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించుకున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అక్కడి వైద్యులు నిర్ధారించారు. సదరు రిపోర్టును తీసుకొని డిండి మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీకి చూపించడంతో ఆయన హైదరాబాద్‌ మలక్‌పేట వంశీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని బుచ్చయ్యకు శస్త్ర చికిత్స చేశారు. మూడు నెలల క్రితం బుచ్చయ్యకు తిరిగి కడుపునొప్పి రావడంతో కల్వకుర్తిలోని ఆస్పత్రిలో చూపించాడు. ఒక కిడ్నీ మాత్రమే ఉందని వారు చెప్పడంతో బాధితుడు డిండిలోని ఆర్‌ఎంపీని నిలదీశాడు. అనంతరం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ విషయమై ఆర్‌ఎంపీ జిలానిని వివరణ కోరగా.. ఇఫెక్షన్‌ కారణంగా ఒక కిడ్నీ చెడిపోయిందని, మరొకటి సైతం ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉండడంతో బాధితుడికి విషయాన్ని చెప్పి ఆపరేషన్‌ చేసి తొలగించారని తెలిపారు. అందుకు సంబంధించిన రిపోర్టులు సైతం బాధితుడి వద్దే ఉన్నాయని తెలిపారు.