ఇదేనా ఆరోగ్య ఆంధ్ర?

మీరేం మనుషులు?
మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితి!
అమరావతికి పెట్టుబడులు ఎలా వస్తాయి?
ప్రాణాలు పోతుంటే రాజకీయాలా?
నేను మరింత గట్టిగా విమర్శించగలను
48 గంటల్లోపు పరిస్థితి చక్కదిద్దాలి
లేకుంటే నిరసన దీక్షకు దిగుతా: పవన్‌
గుంటూరు(మెడికల్‌), మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ అంటే ఇదేనా? రాజధానికి అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరులోనే డయేరియా మరణాలు సంభవించడమా? రక్షిత నీరు కూడా అందించలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని తెలిసి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు ఎలా ముందుకు వస్తాయి?’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. గుంటూరులో తీవ్ర అతిసార బారినపడిన వారిని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. గుంటూరు సంఘటనకు సంబంధించి ప్రభుత్వ స్పందనను తీవ్రంగా ఖండించారు. ‘‘ఏం మనుషులండీ మీరు? ప్రాణాలు పోతుంటే రాజకీయాలు చేస్తారా? నోటికి వచ్చినట్లు మాట్లాడితే, నేను కూడా దానికి పదింతలు, ఇంకా గట్టిగా మాట్లాడగలను. మనుషులు చనిపోతుంటే రాజకీయాలు చేస్తారా?’’ అని మండిపడ్డారు. ప్రభుత్వం 14 మంది మరణించినట్లు చెబుతున్నా... 24 మంది చనిపోయినట్లు తనకు సమాచారం ఉందని పవన్‌ తెలిపారు. ‘‘కలుషిత నీటితో జనం మృతి చెందినట్లు తె లిసినా ప్రభుత్వ పెద్దల్లో సరైన స్పందన లేదు. అదే నీటి కారణంగా ప్రజా ప్రతినిధులు మరణిస్తే ప్రభుత్వం ఇలాగే స్పందించేదా?’’ అంటూ పవన్‌ ఆవేశంగా ప్రశ్నించారు.
 
48 గంటలు డెడ్‌లైన్‌...
గుంటూరులో ప్రభుత్వం వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. 48 గంటల్లోపు గుంటూరులో పరిస్థితిని చక్కదిద్దకుంటే నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. నగరంలో దెబ్బతిన్న మంచినీటి పైపులైన్లు మార్చి శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. బాధితులందరికీ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తానని పవన్‌ పునరుద్ఘాటించారు. హోదా సాధనలో అన్ని పార్టీలు కలసి పని చేయాల్సి ఉన్నా రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.అవిశ్వాసంపై మాట ఎందుకు మారుస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. 23న అవిశ్వాసంఅన్న వైసీపీ ముందుగానే నోటీసు ఇచ్చిందని, అసలు అవిశ్వాసమే అక్కర్లేదన్న టీడీపీ కూడా శుక్రవారం ఆ దిశగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.