అవయవదానంపై అవగాహన పెంచాలి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): అవయవ దానంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏటా 85వేల మంది రోగులు కాలేయ దాతల కోసం ఎదురుచూస్తుండగా.. 3 శాతం కంటే తక్కువ మందే అవయవాలు పొందుతున్నారని తెలిపారు.అలాగే 3 లక్షల మంది రోగులు కిడ్నీ మార్పిడికి పేర్లు నమోదు చేసుకోగా.. కేవలం 8 వేల మందే కిడ్నీలు పొందగలుగుతున్నారన్నారు.
 
శుక్రవారమిక్కడి హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ 29వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. హృదయ సంబంధిత అవయవ దానంలో చాలా వెనకబాటు ఉందని.. డిమాండ్‌కు, సరఫరాకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. దేశంలో 10లక్షల మందిలో కేవలం 0.8 శాతం మందే అవయవదానం చేస్తున్నారని తెలిపారు. సంప్రదాయాలపై ఉన్న నమ్మకమే అవయవదానాలపై ప్రభావం చూపుతోందని, డాక్టర్లు, ఎన్‌జీవోలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో 10.5 లక్షల మంది వైద్యుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 6.5లక్షల మందే ఉన్నారని తెలిపారు. ప్రతి డాక్టర్‌ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 2-3ఏళ్ల పాటు పని చేయడం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.