డాక్టర్‌ను చూడగానే హైపర్‌ ‘టెన్షన్‌’

ఆ కంగారులో పరీక్ష .. బీపీ నమోదు

రోగులకు ‘వైట్‌ కోట్‌ బీపీ’ చిక్కులు
మూడో వంతు ఈ తరహా బాధితులే
బీపీ మందులు వాడితే ప్రమాదమే
ఇండియా హార్ట్‌ స్టడీ సంస్థ సర్వే

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రి పరిసరాల్లోకి వెళ్లగానే కొందరు హడలెత్తిపోతారు. వైద్యుడిని చూడగానే ఆ ఆందోళన మరింత తీవ్రమవుతుంది. అప్పటికప్పుడు రక్తపోటు పరీక్ష చేస్తే.. బీపీ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. నిజానికి వారికి బీపీ మామూలుగానే ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లినప్పుడో.. డాక్టర్‌తో మాట్లాడుతున్నప్పుడో ఆ తాలూకు ఆందోళన కారణంగా బీపీ ఎక్కువగా ఉన్నట్లు పరీక్షలో వెల్లడవుతుంది. దీన్నే వైద్య పరిభాషలో ‘వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌’ అంటారు. ఇప్పుడు మనదేశంలో చాలామంది తమకు తెలియకుండానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో ఈ తరహా బాధితులు పెరిగిపోతున్నట్లు ‘ఇండియా హార్ట్‌ స్టడీ’ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేల్చింది.

వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌తో దేశంలో 24శాతం బాధపడుతున్నట్లు తేలింది. మన రాష్ట్రంలోనైతే 36శాతం వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌ బాధితులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ సర్వేను ఇండియా హార్ట్‌ స్టడీ సంస్థ 2018 జూన్‌ నుంచి గత ఏప్రిల్‌ వరకు పదహారు రాష్ట్రాల్లో నిర్వహించింది. తొలి దఫా సర్వే ఫలితాలను బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు మెడికల్‌ ఇరైస్‌ లైఫ్‌ సైన్స్‌ అద్యక్షుడు విరాజ్‌ సువర్ణ, కార్డియో వాస్కులర్‌ విలియం వేర్‌బెర్క్‌, ఉస్మానియా ఆస్పత్రి నెఫ్రాలజిస్టు మనిషా సహాయ్‌. అపోలో ఆస్పత్రి డాక్టర్‌ సునీల్‌ కపూర్‌ వివరించారు. తమిళనాడులో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో ఉంది.
 
ముప్పు ఇదీ..
వయసు పెరిగిన వారి విషయంలో తప్ప వాస్తవానికి ువైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌ మరీ అంత కంగారు పడాల్సిన లక్షణం ఏమీ కాదని అంటారు. అయితే.. రోగి విషయంలో వైద్యుల అవగాహన లోపంతోనే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రికి వచ్చినవెంటనే రోగి మానసిక పరిస్థితిని గుర్తించకుండా బీపీ పరీక్షలు చేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న రోగులకు రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించి.. బీపీ మందులు రాస్తున్నారు. వారేమో ఏడాపెడా రోజూ బీపీ ముందులు వేసుకుంటున్నారు. వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌ వల్ల సరిగా నిర్ధారణ జరగని బీపీకి మందులను వినియోగించడం వల్ల దాని ప్రభావం కిడ్నీలపై పడుతుందని, ఉస్మానియా ఆస్పత్రి నెఫ్రాలజిస్టు డాక్టర్‌ మనీషా సహాయ్‌ హెచ్చరించారు. హైపర్‌టెన్షన్‌ నియంత్రణలో ఉంటే కిడ్నీ జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునన్నారు.
 
బీపీ పరీక్ష ఇలా..
ఆస్పత్రికి వచ్చిన వెంటనే బీపీపరీక్ష చేయద్దు
15 నిమిషాల పాటు బాధితుడిని ప్రశాంతంగా కూర్చోనివ్వాలి
మెట్లు ఎక్కి వచ్చిన వెంటనే బీపీ టెస్ట్‌ చేయొద్దు
రోగికి ఆయాసం, ఆందోళన ఉన్నప్పుడు పరీక్ష చేయద్దు
అన్ని రకాల ఎలకా్ట్రనిక్‌ యంత్రాలు సరైన ఫలితాలు ఇవ్వవని గుర్తించాలి
మందులు ఎప్పుడు?
బీపీ 135/85 వరకు ఉన్నంత వరకు ఎలాంటి మందులు వాడొద్దు
బీపీ అంతకు మించినా వెంటనే మందులు వేసుకోవద్దు
ఆహారం, జీవనశైలిలో మార్పులు అవసరం, వ్యాయామం చేయాలి
ఇలా 3నెలల పాటు బీపీ నియంత్రణలో ఉంటే మందుల అవసరం లేదు
భుజం వద్ద పరీక్ష చేసి బీపీని నిర్ధారించాలి.