సర్కారు ఆస్పత్రిలో ‘అమ్మ’కు ఎంత కష్టమో!

బాలింత, గర్భిణులకు ప్రసూతి సేవలు అంతంతమాత్రమే

వార్డులు, పడకలూ పెంచినా తప్పని తిప్పలు
గైనిక్‌ వార్డుల్లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు
266 పోస్టులకు 38 మందే నియామకం
ఆరోగ్యశాఖ తీరుపై అన్నివర్గాల విస్మయం

అమరావతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఆసరా ప్రభుత్వాస్పత్రులే!.. ప్రధానంగా గర్భిణులు, బాలింతలకు ఈ ధర్మాస్పత్రులే దిక్కు.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమివ్వాల్సిన విభాగం కూడా ఇదే!.. కానీ మన సర్కారు దవాఖానాల్లో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఎప్పుడో నియమించిన పాత సిబ్బందితోనే నెట్టుకువస్తుండడంతో ఆస్పత్రికి వచ్చే ‘అమ్మ’ల కష్టాలు చెప్పనలవిగా ఉన్నాయి.ప్రభుత్వం గైనిక్‌ యూనిట్లు పెంచినా ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి దాపురించింది!.

 
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కిమ్మనని ఆరోగ్యశాఖ!
గతంలో బోధనాస్పత్రుల్లో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు, ఇద్దరు శిశువులు ఉండే ఘటనలు నిత్యం ఎదురయ్యేవి. అలాంటి ఇబ్బందులు బాలింతలకు ఎదురుకాకూడదని.. రాష్ట్రంలో ఏడు బోధనాస్పత్రుల్లో 19 గైనిక్‌ యూనిట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో అనుమతిచ్చింది. అనుగుణంగా సిబ్బందిని కూడా నియమించుకోవాలని ఆరోగ్యశాఖకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ కొత్త వార్డులను ఏర్పాటు చేసింది. ఆర్నెల్ల క్రితమే అనుమతి ఇచ్చినా ఆయా వార్డుల్లో అవసరమైన సిబ్బందిని మాత్రం నియమించుకోలేకపోయింది. దీంతో పాత సిబ్బందే కొత్త వార్డుల్లోనూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. అసోసియేట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించడం,. హెడ్‌ నర్సులు, స్టాఫ్‌నర్సు, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోల నియామకం మాత్రం పూర్తి చేయలేదు.
 
దీంతో కొత్త వార్డుల నిర్వహణ కష్టంగా మారుతోంది. ఇప్పటికే ఉన్న వార్డులల్లో సిబ్బంది కొరతతో బాలింతలు, గర్భిణులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నారు. బాలింతలకు అత్యవసరమైనప్పుడు వెంటనే స్పందించే సిబ్బందే ఉండటం లేదు. నర్సులకు పని ఒత్తిడి పెరగడం, ఫోర్త్‌ క్లాస్‌ సిబ్బంది సరిపడా లేకపోవడం ఇందుకు కారణం. ఒక్కో గర్భిణి వెంబడి ఇద్దరు, ముగ్గురు సహాయకులు వస్తే తప్ప వారిని పట్టించుకునే వారు ఉండటం లేదు. ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌ఓలు చేయాల్సిన పనులు గర్భిణితో పాటు వచ్చిన బంధువులు చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.
 
నియామకాలెప్పుడు..?
కొత్త గైనిక్‌ వార్డుల్లో 19 గైనిక్‌ యూనిట్లకు 266 మంది మెడికల్‌ సిబ్బంది, 147 నాన్‌ మెడికల్‌ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో 38 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను తప్ప మిగిలిని సిబ్బందిని నియమించుకోవడంలో ఆరోగ్యశాఖ విఫలమైంది. ఇంకా 19 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు, మరో 19 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించాలి. 57 మంది హెడ్‌ నర్సులు, 133 మంది స్టాఫ్‌ నర్సులను నియమించుకోవాల్సి ఉంది.
 
కానీ ఆరోగ్య శాఖకు పట్టిన రోగం ఏమిటో అర్థం కావడంలేదు!!. వీటితో పాటు 147 మంది ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన నియమించుకోవాల్సి ఉన్నా బోధనాస్పత్రుల అధికారులదీ అదే తీరు. కొన్నిచోట్ల ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు లక్ష నుంచి రెండు లక్షల వరకు బేరం పెట్టినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో పోస్టులో శిక్షణపొందిన వారిని నియమించాల్సి ఉన్నా తుంగలో తొక్కుతున్నారు. ఈ దుస్థితి రాజధాని పరిధిలోని బోధనాస్పత్రుల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులపై ఆరోగ్యశాఖ ఇప్పటికైనా మేల్కోవాలన్నదే అందరి ఆకాంక్ష!!?