ప్రతి కుటుంబానికీ హెల్త్‌ కార్డ్‌

ప్రతి కార్డుపై క్యూఆర్‌ కోడ్‌.. రోగవివరాలు కోడ్‌తో అప్‌డేట్‌

స్కాన్‌చేస్తే రోగి ఫోన్‌కి ఓటీపీ.. డిసెంబర్‌ 21 నుంచి పంపిణీ
ఆరోగ్యశ్రీ శక్తిమంతానికి కృషి.. రూ.1000 దాటితే ఉచితం
వచ్చేఏడాది నుంచి అమల్లోకి.. పక్కరాష్ట్రాల్లోని ఆస్పత్రులలో నవంబరు నుంచి ఆరోగ్యశ్రీ
మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మార్పు
వైద్య, ఆరోగ్య సమీక్షలో సీఎం

అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొత్త హెల్త్‌ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యూఆర్‌ కోడ్‌తో ఉండే ఈ కార్డులను డిసెంబరు 21 నుంచి జారీ చేయాలని నిర్దేశించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖపై మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమీక్ష సందర్భంగా జగన్‌ ఈ ఆదేశాలు జారీచేశారు. ‘‘కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే కార్డు స్కాన్‌ చేయగానే ఆ కార్డుదారుకి ఓటీపీ నంబర్‌ వచ్చే విధంగా ఏర్పాటుచేయాలి’’ అంటూ కొత్త కార్డు రూపురేఖలను గురించి వివరించారు. ఆరోగ్యశ్రీని శక్తివంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని జగన్‌ ఆదేశించారు.

‘‘రూ. ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి. ఈ పథకం సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితాను తయారుచేయాలి. రెండు వేలకు పైగా శస్త్ర చికిత్సలను ఈ పథకం కిందకు తీసుకురావాలి’’ అని నిర్దేశించారు. రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించే కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తామని, పైలట్‌గా తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు.
 
ఆస్పత్రులకు గ్రేడింగ్‌
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నాణ్యత దెబ్బతినకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ‘‘ప్రమాణాలు పాటిస్తున్న ఆస్పత్రులకు గ్రేడింగ్‌లు ఇవ్వండి. ఎ ప్లస్‌, ఎ, బి, సి కేటగిరీలను అందుబాటులోకి తీసుకురావాలి’’ అని కోరారు. ఇప్పటికే థర్డ్‌ పార్టీ ద్వారా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితా ఉంచాలని, అర్హతలున్న ఆస్పత్రులు ఏవైనా, నెట్‌వర్క్‌లో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చునని జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 436 నెట్‌వర్క్‌ ఆస్పత్రులతోపాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి, నవంబర్‌ నుంచి అమల్లోకి తీసుకురావాలని కోరారు.
 
‘స్కూళ్ల’ మోడల్‌లో మరమ్మతులు
ఇప్పటికే అన్ని ఆస్పత్రుల ఫొటోలు తీశామని, వాటి మరమ్మతులకు సంబంధించిన టెండర్లను కూడా సిద్ధం చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. స్కూళ్లు మాదిరిగానే ఆస్పత్రుల్లో చేపట్టాల్సిన పనులను ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయించాలని సీఎం సూచించారు. రోగుల కోసం కొనుగోలుచేసిన మందుల్లో నాణ్యత ఉండాలన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా, సీహెచ్‌సీలు, డిసెంబర్‌ 2021నాటికి పీహెచ్‌సీల మరమ్మతులను పూర్తి చేయాలని, 2022 జూన్‌ నాటికి సబ్‌సెంటర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
 
దేనికీ రోగులు బయటకెళ్లొద్దు..
ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన రోగులు మందుల కోసం, రక్తపరీక్షల కోసం బయటకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ఏ పరికరం కొనుగోలు చేసినా నిర్వహణ, మరమ్మతుల కోసం ఇబ్బంది పడకూడదని, అది టెండర్ల నిర్వహణకు సంబంధించి ఒక షరతుగా ఉండాలన్నారు. వైద్య పరికరాల సమర్థ నిర్వహణకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆయన, 2021సెప్టెంబరు నాటికి ఏ ప్రభుత్వాస్పత్రీ పరికరాల లేమితో ఇబ్బంది పడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో వైఎ్‌సఆర్‌ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 104 వాహనాల ద్వారా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. దీని వల్ల ఎవరైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి సులభంగా వైద్యులకు తెలుస్తుందని చెప్పారు.
 
త్వరలో ఐదు క్యాన్సర్‌ ఆస్పత్రులు
విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కడప జిల్లాల్లో పూర్తిస్థాయి వైద్యసదుపాయాలతో ఐదు కేన్స ర్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్లు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్నారు. పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకోసం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. అక్టోబరు 10 నుంచి వైఎ్‌సఆర్‌ కంటి వెలుగు పథకం కింద కంటి పరీక్షలు ప్రారంభిస్తామని, సమస్య ఉన్నవారిని గ్రామాలవారీగా వైద్యులు గుర్తించి ఆపరేషన్లు, కళ్లజోళ్లు పంపిణీ చేస్తారని తెలిపారు.
 
‘సి’లో ఉంటే ఇంటికే..
‘‘ప్రభుత్వాస్పత్రులను ‘ఎ-ప్లస్‌’ కేటగిరిలోకి తీసుకురావాలి. లోపాలున్న ఆస్పత్రులను ‘బి’ కేటగిరిలో ఉంచి, మెరుగయ్యేందుకు కొంత గడువు ఇవ్వాలి. మళ్లీ తనిఖీలు చేసి అవేలోపాలుంటే వాటిని నెట్‌వర్క్‌ జాబితా నుంచి తొలగించాలి. ప్రమాణాలు, సౌకర్యాలు లేని ఆస్పత్రులను కేటగిరి ‘సి’లో చేర్చి వాటిని నెట్‌వర్క్‌ జాబితా నుంచి పూర్తిగా తొలగించాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.