2500 ఏళ్ల క్రితం నాటి వైద్యం

ముక్కు సర్జరీకి శుశ్రుతుడే దిక్కయ్యాడు
పనిచేయని ఆధునిక వైద్యం..
శుశ్రుత సంహితను ఆశ్రయించిన వైద్యులు

09-10-2018:సర్జరీలు చేయడానికి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కత్తి గాటు పెట్టకుండానే వైద్యులు శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు. అయినా.. ఓ మహిళ ముక్కుకు సర్జరీ విషయంలో ఇవేమీ చేయలేకపోయాయి. కానీ వైద్య శాస్త్ర పితామహుడిగా పేరొందిన శుశ్రుతుడి పద్ధతి ఫలితాన్నిచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. 2500 ఏళ్ల క్రితం ‘శుశ్రుత సంహిత’లో శుశ్రుతుడు చెప్పిన పద్ధతుల్లో శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు ఢిల్లీ వైద్యులు. అఫ్గనిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ముక్కుకు నాలుగేళ్ల క్రితం బుల్లెట్‌ గాయమైంది.

దీంతో వాసనను గుర్తించే లక్షణాన్ని కోల్పోయింది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు రావడంతో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవడానికి ఢిల్లీకి వచ్చింది. ఆమెను పరీక్షించిన కేఏఎస్‌ మెడికల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ అజయా కశ్యప్‌.. అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి చికిత్స చేసే ప్రయత్నం చేశారు. ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా ప్రయత్నించారు. కానీ సర్జరీ సక్సెస్‌ కాలేదు. చివరకు శుశ్రుతుడు చెప్పిన పద్ధతులను ఉపయోగించారు. చెంప నుంచి చర్మాన్ని తీసుకుని ముక్కును పునర్నిర్మించారు. సోమవారం జరిగిన సర్జరీ విజయవంతం కావడంతో.. ఇప్పుడామె వాసన పసిగట్టడంతో పాటు ఎప్పటిలానే శ్వాస తీసుకోగలుగుతుంది.