హాయ్‌.. నేను డాక్టర్‌ రోబో!

రోగులకు మరమనిషి సేవలు

కరచాలనం చేస్తే బీపీ రికార్డు చేస్తుంది
రోగిని వైద్యుడి వద్దకు తీసుకెళ్తుంది
మళ్లీ ఆస్పత్రికి వస్తే ‘హలో’ అని పలకరింపు
తొలిసారి సన్‌షైన్‌ ఆస్పత్రిలో అందుబాటులోకి

టీహబ్‌లోనే తయారైన రోబో

రాయదుర్గం, హైదరాబాద్‌ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ‘ఓ ఆస్పత్రిలో కడుపులో బిడ్డ అడ్డం తిరిగి గర్భిణి తీవ్ర నొప్పులతో రోదిస్తోంది. ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆపరేషన్‌ చేయడానికి వైద్యులు జంకుతున్నారు. ఏ మాత్రం సాహసం చేసినా తల్లీబిడ్డ ప్రాణానికి ముప్పే. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఆపరేషన్‌ చేసి తల్లీబిడ్డను కాపాడాడు.’ రోబో సినిమాలోని సన్నివేశం ఇది. చికిత్స చేసిన ఆ వ్యక్తి మనిషి కాదు మరమనిషి. ఆ స్థాయిలో కాకపోయినా నాడీ చూసి బీపీ ఎంత ఉందో చెప్పే రోబో.. ఆదివారం కొత్తగా రాయదుర్గంలో ప్రారంభమైన సన్‌షైన్‌ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చేసింది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి ఈ రోబోతో కరచాలనం చేస్తే చాలు.. స్వాగతం పలికి బీపీ పల్స్‌ రేటును నమోదు చేస్తుంది. రోగి పేరు చెప్పగానే రీడింగ్‌ చేసుకొని, అతడి ముఖాన్ని స్కాన్‌ చేసి తన మెమరీలో నిక్షిప్తం చేసుకుంటుంది. రోగిని రిసెప్షన్‌ వద్దకు తీసుకెళ్తుంది. అక్కడ సిబ్బంది.. రోగి పేరుతో రికార్డు సిద్ధం చేసి సంప్రదించాల్సిన డాక్టర్‌ పేరు, విభాగాన్ని రోబోకు వివరిస్తారు. సిబ్బంది సూచించిన ప్రకారం రోగిని వెంటబెట్టుకొని సదరు డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లి అప్పగించి తిరిగి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటుంది. ఒకసారి తన పేరును రోబో వద్ద పేరు నమోదు చేసుకున్న వ్యక్తి మళ్లీ ఆస్పత్రికి చికిత్స కోసం వస్తే అతడ్ని గుర్తుపెట్టుకొని ‘హలో’ అని పలకరించి అవసరమైన సేవల్ని అందించే ప్రయత్నం చేస్తుంది. టీహబ్‌లోనే తయారైన ఈ రోబోను తొలిసారి సన్‌షైన్‌ ఆస్పత్రిలో ప్రవేశపెట్టినట్లు ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గురవారెడ్డి చెప్పారు. రోబో చేతికి ఉండే ప్రత్యేక సెన్సర్‌ పరికరాల ద్వారా రోగి బీపీ చెక్‌ చేస్తుందని తెలిపారు. మున్ముందు ఈ రోబోలో రోగికి సంబంధించిన డయాగ్నస్టిక్‌ నివేదికలను కూడా నిక్షిప్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. రోగి మరోసారి ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చిన సమయంలో ఈ రోబో ద్వారా తన పాత నివేదికలను ప్రింట్‌ను కూడా తీసుకోవచ్చునన్నారు. ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర హోం మంత్రి నాయిని, సంగీత దర్శకుడు కీరవాణి ఈ రోబో పనితీరుకు ముగ్ధులయ్యారు. ఉగాదిని పురస్కరించుకొని సన్‌షైన్‌ ఆస్పత్రిని ప్రారంభించారు.