డెలివరీలపై ప్రభుత్వ సంచలన నిర్ణయం

గండాల గర్భాలకు మరింత అండ
ముందే హైరిస్క్‌ ప్రెగ్నెన్సీల గుర్తింపు
ఎంపిక చేసిన ఆస్పత్రుల్లోనే డెలివరీ
అక్కడ బ్లడ్‌బ్యాంక్‌, గైనకాలజిస్టు,
మత్తుమందు, చిన్నపిల్లల డాక్టర్లు తప్పనిసరి

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ (గండాల గర్భం)లపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇకనుంచి వీటిని ఎంపిక చేసిన తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రుల్లో నిర్వహించనుంది. ఆయా ఆస్పత్రుల్లో కచ్చితంగా బ్లడ్‌ బ్యాంక్‌, గైనకాలజిస్టు, మత్తుమందు డాక్టర్‌, చిన్న పిల్లల డాక్టర్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఈ మేరకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పది జిల్లాల్లో హైరిస్క్‌ ప్రెగ్నెన్సీలను గుర్తించడం, ఆ ప్రసవాలు మరింత సురక్షితంగా ఎలా నిర్వహించాలన్న అంశంపై ఇప్పటికే 10 మంది ఉన్నతాధికారులను నియమించారు. జిల్లాల్లో పరిస్థితిపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. నిజానికి, ఇప్పటి దాకా హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ మహిళలను గుర్తిస్తున్నా.. సాధారణ ప్రసవాల మాదిరిగానే వారు తమకు వెసులుబాటున్న సర్కారీ దవాఖానల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు.

ఇకనుంచి హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ మహిళలకు వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లోనే పురుడు పోయనున్నారు. వాస్తవానికి, తొలి, రెండో యాంటీ నాటల్‌ చెకప్‌ (ఏఎన్‌సీ)తో రిస్క్‌ ప్రెగ్నెన్సీనా కాదా తెలుస్తుంది. నాలుగో ఏఎన్‌సీలో రిస్క్‌ తీవ్రత వెల్లడవుతుంది. దాని ఆఽధారంగా రిజిష్ట్రేషన్‌ చేస్తారు. వీరికి ఎక్కడ డెలివరీ చేయాలో నిర్ణయించి సమీపంలోని టీవీవీపీ ఆస్పత్రిని ఎంపిక చేస్తారు. ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్లలోనే ప్రసవాలయ్యేలా చర్యలు తీసుకుంటారు. హైరిస్క్‌ ప్రెగ్నెన్సీలకు ట్యాగట్‌ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అంటే, వారు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. వీరిని ప్రసవ తేదీకి అవసరాన్ని బట్టి ఐదు నుంచి 10 రోజులు ముందుగానే ఎంపిక చేసిన ఆస్పత్రికి పంపుతారు.
 
ప్రస్తుతం అత్యవసరమైతే 108కి ఫోన్‌ చేసి ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. కొన్ని సందర్భాల్లో 108 వాహనాలు రాకపోవడంతో హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ మహిళలు తీవ్ర ఇబ్బంది పడి, ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం కోసం వేచి చూడకుండా వేరే వాహనాన్ని అద్దెకు తీసుకెళ్లేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేశారు. ఇకనుంచి దీని కింద స్థానిక ఆశా వద్ద రూ.2000, మెడికల్‌ ఆఫీసర్‌ వద్ద రూ.5 వేలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌లో రూ.10 వేలు, జిల్లా ఆస్పత్రుల్లో రూ.15 వేలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి.
 
హైరిస్క్‌ పరిధిలోకి వచ్చేది వీరే!
పొట్టిగా ఉన్న గర్భిణులు; గతంలో సిజేరియన్స్‌ అయినవారు, తరచూ అబార్షన్‌ అవుతున్నవారు, రక్తహీనత, థైరాయిడ్‌, బీపీ, షుగర్‌ ఉన్న గర్భిణులు.
 
కొత్త విధానంలో మేలు ఏమిటంటే..
హైరిస్క్‌ ప్రెగ్నెన్సీలకు అనవసర వెయిటింగ్‌ ఉండదు
గతంలో ఇటువంటి కేసులను చివరి నిమిషంలో ఎక్కడో దూరాన ఉన్న హైదరాబాద్‌కు పంపేవారు. ఇప్పుడా బాధలు తగ్గుతాయి.
ఇటువంటి కేసుల్లో ప్రాణాపాయం తగ్గుతుంది.
ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడం కూడా తగ్గుతుంది.