నొప్పి తెలియని బాలిక!

అరుదైన వ్యాధే కారణం
10 లక్షల్లో ఒకరికి ఎనాల్జిసియా
ఎప్పుడూ నీడలోనే ఉండాలి
ఎండ తగిలితే జ్వరం, చర్మ వ్యాధులు
గుంటూరు (మెడికల్‌), ఫిబ్రవరి 11:చిన్న పిల్లలు సూది మందును చూడగానే ఏడుస్తారు. ఈ విషయంలో ఆ బాలిక చిన్నప్పటి నుంచీ భిన్నం. టీకా వేసినా, ఇంజక్షన్‌ చేసినా నవ్వుతూనే ఉంటుంది. నిప్పులకు దూరంగా ఉండు.. లేదంటే కాలుతుందని పెద్దలు పిల్లల్ని అప్రమత్తం చేస్తుంటారు.
 
కానీ ఆ బాలికకు ఇదే మాట చెబితే... ‘కాలడం అంటే ఏమిటమ్మా!’ అని అమాయకంగా అడుగుతుంది. ఎందుకంటే ఆ చిన్నారికి కాలిన నొప్పి తెలియదు. పుట్టుకతోనే అత్యంత అరుదైన ‘కంజెనిటల్‌ ఇన్‌సెన్సిటివిటి పెయిన్‌ అండ్‌ ఎన్‌హైడ్రోసి్‌స’ (ఇంజెనిటల్‌ ఎనాల్జిసియా) వ్యాధి బారిన పడడమే ఇందుకు కారణం. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లికి చెందిన ధరావత్తు మహిత (8) ఈ వ్యాధితో వైద్య వర్గాలకు పజిల్‌గా మారింది. తల్లిదండ్రులు లోక్లా నాయక్‌, యమునది మేనరికపు వివాహం. వారికి పుట్టిన ఇద్దరు పిల్లల్లో చిన్నదైన మహితకు ఈ వ్యాధి చిన్ననాటి నుంచీ ఉంది. దెబ్బ తగిలితే శరీరంలో ఉండే నాడీ కణాలు వెంటనే ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి.
 
ఇందుకు సీ, ఏ డెల్టా ఫైబర్స్‌ అనే నాడీ కణాలు తోడ్పడతాయి. పుట్టుకతోనే ఈ బాలికలో డెల్టా ఫైబర్‌ కణాలు లోపించాయి. దీంతో బాలికకు నొప్పి సంకేతాలు మెదడుకు చేరవు. మొదట్లో కుటుంబసభ్యులకు వింతగా అనిపించినా.. వైద్యులను కలిసిన తర్వాత విషయం తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు.
 
శీతలమే ఉపశమనం!
రెండేళ్ల కిందట చికిత్స కోసం మహితను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌వీ సుందరాచారి బాలికను పరీక్షించి అరుదైన జన్యు వ్యాధి బారినపడ్డట్లు నిర్ధారించారు. మరికొన్ని పరీక్షల కోసం చర్మవ్యాధుల విభాగానికి పంపారు. డీవీఎల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీదేవి పరీక్షలు నిర్వహించి మహిత శరీరంలో స్వేద గ్రంథులు ఏర్పడలేదని గుర్తించారు.
 
ఈ కారణంగా బాలిక ఎండలో తిరిగితే వెంటనే జ్వరం వస్తుంది. చెమట పట్టకపోతే శరీరం చల్లబడదు. వేసవిలో చిన్నారిని చల్లటి ప్రాంతంలోనే ఉంచాలి. ఏసీ, ఎయిర్‌ కూలర్‌ వంటివి ఉండాల్సిందే. గాయాలైతే తగ్గవు. శక్తివంతమైన యాంటీ బయోటిక్‌ మందులు వాడాలని డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స లేదని, బాలికను నీడ పట్టున ఉంచడం, గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వికలాంగుల కోటాలో ఫించనుకు సిఫార్సు చేస్తున్నట్లు డాక్టర్‌ తెలిపారు.