జీజీహెచ్‌కు రిపేర్ల రోగం!

ఆస్పత్రిలో పనిచేయని 250 పరికరాలు
సిటీ స్కాన్‌ మొరాయించి నెల రోజులు
పాడైన వెంటిలేటర్లు, ఎక్స్‌రే యంత్రాలు
బిల్లులివ్వట్లేదని చేతులెత్తేసిన కాంట్రాక్టరు

గుంటూరు, ఆగస్టు 13: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)కి రిపేర్ల రోగమొచ్చింది! ఈ ఆస్పత్రిలో రోగులకు సేవలందించేందుకు అత్యంత కీలకమైన 250 పరికరాలు నెల రోజుల నుంచి మూలనపడ్డాయి. సిటీ స్కాన్‌ మొరాయించి నెల రోజులవుతోంది. హాస్పటల్‌లోని 45 వెంటిలేటర్లలో 13, 12 ఎక్స్‌రే యంత్రాల్లో 5 పనిచేయడం లేదు. ఆఖరుకు బ్రెయిన్‌ సర్జరీల్లో కీలకపాత్ర పోషించే మైక్రోస్కోప్‌, కిడ్నీలో రాళ్లు తొలగించే లిథోట్రప్సి మిషన్లు కూడా మూలన పడ్డాయంటే జీజీహెచ్‌ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 
టీబీఎ్‌సకు ఏటా 40 కోట్లు..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు టీబీఎస్‌ అనే కంపెనీకి ఏటా రూ.40 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం 2020 వరకూ ఉంది. దీని ప్రకారం కొన్ని పరికరాలు 24 గంటల్లో, మరికొన్ని 72 గంటల్లో రిపేరు చేయాలి. వెంటిలేటర్లు చెడిపోయిన వెంటనే దాని స్థానంలో మరో వెంటిరేటర్‌ను అందుబాటులో ఉంచాలి. మూడేళ్ల నుంచి ఇదే పద్ధతిలో సదరు సంస్థ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో పరికరాల మరమ్మతులు నిర్వహిస్తోంది. అయితే కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌ మరమ్మతులు నిలిపివేశారు. దీంతో దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
 
కొన్ని ఖర్చులు వైద్యులే భరిస్తున్నారు
కీలకమైన పరికరాలు మరమ్మతులకు గురి కావడంతో కీలక విభాగాల్లో శస్త్రచికిత్సలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మెదడులోని కణితులను స్పష్టంగా గుర్తించి శస్త్రచికిత్స చేయాలంటే మైక్రోస్కోప్‌ తప్పనిసరి. కానీ న్యూరో సర్జరీ విభాగంలో మైక్రోస్కోప్‌ పాడైపోయింది. ప్రభుత్వం పట్టించుకుంటుందని, కంపెనీ వారు వస్తారని వైద్యులు 15 రోజులపాటు ఎదురు చూశారు. కానీ.. సర్జరీలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో రిపేర్లు చేయించుకున్నారు. కిడ్నీలో రాళ్లు తొలగించే లిథోట్రప్సిని కూడా యురాలజీ విభాగం వైద్యులే బాగు చేయించుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో పది రోజుల్లో జీజీహెచ్‌లో వైద్యులు ఉన్నా సరైన పరికరాలు లేక చికిత్సలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 12 ఎక్సరే యంత్రాల్లో 5 పనిచేయడం లేదు. దీంతో రోగులు బారులు తీరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పనిచేయని బీపీ మీటర్లు చూపిస్తున్న రీడింగ్‌లతో డాక్టర్లకు కూడా బీపీ పెరుగుతోంది. గతంలో కాంట్రాక్టర్‌ అశ్రద్ధ వహించినప్పుడు అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ హెచ్చరించడంతో గంటల్లోనే సమస్య పరిష్కారమైంది. కానీ.. ఇప్పుడు నెల రోజులుగా జీజీహెచ్‌లో పరికరాల పరిస్థితి దారుణంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
 
దూరమైన కంపెనీలు..
గతంలో ఏదైనా కంపెనీ ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక యంత్రాన్ని అమ్మినప్పుడు ఇన్ని సంవత్సరాలపాటు మరమ్మతుల బాధ్యత తమదే అని ఒప్పందం చేసుకుంటుంది. అనంతరం ప్రతి ఏడాదీ ఏఎంసీ కట్టించుకొని మరమ్మతులు నిర్వహిస్తుంది. కాంట్రాక్ట్‌ విధానం అమల్లోకి వచ్చాక ఈ వ్యవహారాలన్నీ టీబీఎస్‌ చూసుకుంటోంది. దీంతో కంపెనీలు ఆస్పత్రులకు దూరమయ్యాయి. అయితే ఇప్పుడు పాడైన మిషన్లు రిపేరు చేసేందుకు కంపెనీలు రాక, టీబీఎస్‌ పట్టించుకోక, జీజీహెచ్‌ టెక్నికల్‌ విభాగానికి అవగాహన లేక పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది.