ఒకే కాన్పులో నలుగురు పిల్లలు!

ప్రసవించిన హైదరాబాద్‌ మహిళ

రాంనగర్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఒక కాన్పులో ఒకరికో, ఇద్దరికో జన్మనివ్వడం సహజంగా జరిగేదే. కానీ నగరానికి చెందిన హేమలతాయాదవ్‌ అనే మహిళ ఏకంగా నలుగురు బిడ్డలను ప్రసవించింది. ఇద్దరు మగశిశువులు, ఇద్దరు ఆడ శిశువులు. ఈ ఘటన విద్యానగర్‌లోని నియోబీబీసీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మౌలాలికి చెందిన హేమలత(23)కు, రంగారెడ్డి జిల్లా వెంకటాపూర్‌కి చెందిన హేమలత మూడో నెల స్కానింగ్‌లో నలుగురు పిల్లలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఏడు నెలలు నిండిన అనంతరం, డెలివరీ చేస్తే మంచిదని వైద్యులు చెప్పడంతో హేమలత దంపతులు అంగీకరించారు. ఈ నెల 2న సిజేరియన్‌ చేసి వైద్యులు పిల్లలను బయటికి తీశారు. శిశువులు ఒకొక్కరు 1.2 నుంచి 1.4 కిలోల వరకూ బరువున్నారని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.