ప్రకాశంలో కొనసాగుతున్న డెంగ్యూ మరణాలు

ప్రకాశం: జిల్లాలో డెంగ్యూ, విష జ్వరాల మరణాలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు ఇద్దరు డెంగ్యూతో, ఓ చిన్నారి విష జ్వరంతో మృతిచెందారు. ఒంగోలుకు చెందిన నవ్యశ్రీ(19), అద్దంకి మండలం కటాపురంకు చెందిన ఈశ్వర్ రెడ్డి(33) డెంగ్యూతో మరణించారు. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఘోష్ రోడ్డులో నివాసం ఉండే నవ్యశ్రీ ఓ ప్రైవేటు కళాశాలలో బీసీఏ ద్వితియ సంవత్సరం చదువుతోంది.

 
ఈ నెల 7న ఆమెకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని మణిపూర్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కన్నబిడ్డ మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
 
లక్కవరంలో విషజ్వరంతో చిన్నారి మృతి..
తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామంలో మేడగం వెంకారెడ్డి కుమారుడు వెంకట జయచంద్రారెడ్డి (3) విష జ్వరంతో ఆదివారం మృతిచెందాడు. ప్లేట్‌లెట్స్ తగ్గడంతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
 
కాగా జిల్లా వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాలు మాత్రం డెంగ్యూ వల్ల కాదంటూ వైద్యఆరోగ్య అధికారులు లెక్కల్లోకి ఎక్కించటం లేదు. డెత్ ఆడిట్ నిర్వహించి ఏ కారణంతో చనిపోయారో కూడా తీసుకోవడం లేదు. ఒకే రోజు 8 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి