నిలబడే ప్రసవం.. నేలకు తాకడంతో శిశువు మృతి

ఖమ్మం ఆస్పత్రిలో గర్భిణికి దారుణ అనుభవం

నేరుగా నేలకు తాకి శిశువు మృతి
ఒకేరోజు ముగ్గురు పసికందుల మరణం

ఖమ్మం, సెప్టెంబరు10: అది ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి.. శనివారం సాయంత్రం నిరసన నాగమణి అనే నిండు గర్భిణి పురిటినొప్పులతో వచ్చింది. డాక్టర్లు ఆమెను పట్టించుకోలే దు. ‘‘డెలివరీకి వచ్చేనెల 20న సమయం ఇచ్చాం కదా? నొప్పులు అలాగే వస్తాయి’’ అన్నారు. నొప్పుల బాధ ఎక్కువవుతోందన్నా పట్టించుకోకుండా పడకలు ఖాళీ లేవంటూ ఓ బల్లపై కూర్చోబెట్టా రు. తనను చూడాలంటూ వచ్చిపోయే వైద్యులు, నర్సులను వేడుకున్నా పట్టించుకున్న పాపాపన పోలేదు. అర్ధరాత్రి నొప్పులు మరింత పెరిగాయి. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఆ బాధలో ఎవరైనా సాయం చేస్తారనే ఆశతో లోపలికి వెళ్లేందుకు బల్లపై నుంచి కిందకుదిగింది.
 
అలా నిల్చుని ఉండగానే ఆమెకు ప్రసవం అయింది. శిశువు నేరుగా నేలకు తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆదివారం ఒక్కరోజే ముగ్గురు పసికందుల ప్రాణాలు పోయాయి.
 
దీంతో బాధిత తల్లిదండ్రులు, పలు సంఘాల ప్రతినిధులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలలేమి, వైద్యుల కొరత, సిబ్బంది నిర్లక్ష్యంతోనే నవజాత శిశువులు మృత్యువాత పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు పెంచామని, అక్కడ కాన్పు చేసుకున్నవారికి కేసీఆర్‌ కిట్‌తోపాటు పారితోషకం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్ర భుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి.
 
అయితే, ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచకపోవడం గర్భిణుల పాలిట శాపమైంది. నాగమణి మాదిరిగానే మరో ఇద్దరు తల్లులకు గర్భశోకం మిగిలింది. ముదిగొండమండలం గోకినపల్లికి చెందిన ఆశ అనే గర్భిణిదీ అదే పరిస్థితి. మొదటికాన్పు కోసం ఖమ్మం పెద్దాస్పత్రికి శనివారం వచ్చింది. ఆపరేషన్‌ చేయకపోవడంతో బిడ్డ అడ్డం తిరిగి మృతి చెందింది. ఇల్లెందుకు చెందిన మరో మహిళకు ఆపరేషన్‌ ఆలస్యం చేయడంతో బిడ్డ మరణించినట్టు తెలిసింది. ఈ నెలలో ఆస్పత్రిలో ఐదుగురు శిశువులు మరణించారు.
 
కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారంటూ ఆదివారం బాధితుల బంధువులు, ఐద్వా, ఎన్డీ, పీవైఎల్‌, పీవోడబ్ల్యూ, బీజేపీ మహిళా మోర్చాల ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. అటు ఆస్పత్రిలో శిశుమరణాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే సహించబోమన్నారు. జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి శిశుమరణాలపై విచారణ జరపాలని ఆదేశించారు.
 
ప్రసవం కోసం బల్లలే దిక్కు

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న ఇద్దరు రెగ్యులర్‌ గైనకాలజిస్టులకు ఉద్యోగోన్నతి రావడంతో ఆస్పత్రిలో కాంట్రాక్టు గైనకాలజిస్టులే సేవలందిస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తించిన రెగ్యులర్‌ గైనకాలజిస్టులు డాక్టర్‌ ఎస్‌.మంగళను కొత్తగూడెం సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టుగా బదిలీ చేశారు. డాక్టర్‌ కె.ప్రసన్నజ్యోతి నిర్మల్‌ జిల్లా బైంసా ఏరియా ఆస్పత్రికి సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టుగా బదిలీ చేశారు. నలుగురు కాంట్రాక్టు గైనకాలజిస్టులు పనిచేస్తున్నారు. రెండు గైనకాలజీ పోస్టులు, 20 నర్సు పోస్టలు ఖాళీగా ఉన్నాయి. పడకలు సరిపోకపోవడంతో గర్భిణులను బల్లలపైనే ఉంచుతున్నారు.

ఒకే డాక్టర్‌.. 6 గంటల్లో 11 ప్రసవాలు
జూన్‌5న ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో విధులునిర్వర్తిస్తున్న డాక్టర్‌ ఉషశ్రీ 6 గంటల్లో 11సీజేరియన్‌ ప్రసవాలు చేశారు. ఆ రోజు ఉదయం విధులకు హాజరైన ఆమె.. పగలు ఆరు ఆపరేషన్లు చేశారు. రాత్రి 9గంటలకు మళ్లీ ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లి.. తెల్లవారుజామున మూడింటి వరకు అందులోనే ఉన్నారు. ఆ రాత్రి జరిగిన 16 ప్రసవాల్లో 11 సిజేరీయన్‌ ద్వారా జరిగినవే! ఇద్దరు అసిస్టెంట్‌ సర్జన్‌ల సహాయంతో డాక్టర్‌ ఉషశ్రీ నిర్వహించారు. ఆస్పత్రిలో వైద్యుల కొరతకు ఇదే నిదర్శనం!
 
 
నొప్పులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోలేదు
‘‘నొప్పులు వస్తున్నాయని చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదు. అలాగే వస్తాయి అని విసుక్కున్నారు. ఆస్పత్రిలో పడకలు ఖాళీగా లేవని చెప్పి బల్లమీదనే కూర్చోబెట్టారు. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు’’
- నాగమణి, నిలబడి బిడ్డను కన్న మహిళ
 
 
వైద్యుల నిర్లక్ష్యం లేదు
‘‘నాగమణి ఎనిమిదో నెలలోనే డెలీవరీకి వచ్చింది. బిడ్డ బతకడం కష్టమంటే ఒప్పుకొని సంతకం కూడా చేశారు. ఆశా అనే గర్భిణికి శిశువు కాళ్లు బయటికొచ్చా యి. మత్తు మందు ఇస్తే శిశువుకు ప్రమాదం అని చెప్పగా ఒప్పుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు.’’
- ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మదన్‌సింగ్‌