కూరగాయలు ఇలా భద్రం

పురుగుమందుల అవశేషాలను తొలగించే చిట్కా
జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ విద్యార్థి అధ్యయనం
 
ఆంధ్రజ్యోతి, 12-02-2018: మార్కెట్లో మాంచి లేత వంకాయలో.. బెండకాయలో చూసి జాగ్రత్తగా ఏరి తెచ్చుకుని, బాగా కడిగి వండుకుంటాం. కానీ.. కొన్నిసార్లు ముద్ద నోట్లో పెట్టుకోగానే పురుగుమందు వాసన వస్తుంది. ఇది చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. పురుగుమందు కొట్టి న కొన్ని రోజుల దాకా కూరగాయలను మార్కెట్‌కు తేకూడదు. ఆ నిబంధనను ఎవరూ పట్టించుకోవట్లేదు. పురుగుమందు చల్లిన 1-2 రోజుల్లోనే వాటిని విక్రయిస్తున్నారు. అలా తెచ్చిన కూరగాయల్లో కొన్ని పురుగుమందు వాసన రాకపోవచ్చుగానీ.. ఆ అవశేషాలు మాత్రం అలాగే ఉంటాయి. మనం ఎంత శుభ్రంగా కడిగినా అవి పోవని.. జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీ విద్యార్థి సుధాకర్‌ అధ్యయనంలో తేలింది. జర్నల్‌ ఆఫ్‌ ఎంటమాలజీ అండ్‌ జువాలజీలో సుధాకర్‌ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం.. కూరగాయలపై ఉండే అవశేషాలను పంపునీళ్లు కేవలం 17 నుంచి 39శాతం మాత్రమే తొలగిస్తున్నాయి. ఈ హానికర రసాయన అవశేషాలను పూర్తిగా తొలగించే మార్గాన్ని కూడా సుధాకర్‌ వివరించారు. అదేంటంటే.. 4 లీటర్ల నీళ్లల్లో 160 మిల్లీలీటర్ల ఎసిటికామ్లం (వినెగర్‌లో ఉంటుంది), 4 గ్రాముల తినే ఉప్పు, 4 నిమ్మకాయలు, పిండి తీసిన రసం కలిపి.. ఆ ద్రావణంలో కూరగాయలను కడిగితే రసాయన అవశేషాలు 55 నుంచి 76ు మేర తొలగిపోతాయని పేర్కొన్నారు. దీనికి ఆయన వెజ్జీవాష్‌ అని పేరు పెట్టారు. టొమాటో సాగులో ప్రధానంగా రైతులు వాడే ఐదు రకాల క్రిమిసంహారక మందుల ప్రభావాన్ని ఈ వెజ్జీవాష్‌ తగ్గించినట్టు చెప్పారు. అధ్యయనంలో భాగంగా వెజ్జీవాష్‌ ప్రభావాన్ని టొమాటోలపై పరీక్షించినట్టు ఆయన తెలిపారు.