బట్టతలకు చెక్‌

విశాఖ కేజీహెచ్‌లో ఉచిత చికిత్స

జట్టు రాలినచోట మళ్లీ మొలిచేలా పీఆర్పీ వైద్యం

08-09-2018: జట్టు మొలిపించుకునేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. ఈ బలహీనతను ‘క్యాష్‌’ చేసుకొనే హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. లక్షలు వెచ్చిస్తున్నా సమస్య తీరకపోగా మరింత పెరుగుతోంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఖరీదైన చికిత్స చేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది విశాఖ కింగ్‌ జార్జి ఆస్పత్రిలోని చర్మ వ్యాధుల విభాగం.

ఇలా మొలిపిస్తారు!
జుట్టు రాలిన చోట ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్పీ) చికిత్సతో మళ్లీ వెంట్రుకలను మొలిపిస్తున్నారు. ఈ చికిత్సకు బయట మార్కెట్‌లో భారీగానే వసూలు చేస్తారు. కానీ కేజీహెచ్‌లో నెలకు 60 మందికి ఉచితంగానే చేస్తున్నారు. ఇందుకోసం రోగి నుంచి రక్తాన్ని సేకరించి సెంట్రిఫ్యూజ్‌ అనే యంత్రం సాయంతో పీఆర్పీని విడదీస్తారు. ఆపై జుట్టు రాలిపోయిన చోట దానిని ఇంజెక్ట్‌ చేస్తారు. కొన్నివారాల తర్వాత నెమ్మదిగా వెంట్రుకలు రావడం మొదలవుతుంది. సమస్య తీవ్రత బట్టి రోజుల వ్యవధిలో 10 నుంచి 20 ఇంజెక్షన్లు చేస్తారు. వైద్యులు సూచించే కొన్నిరకాల మందులు వాడాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఈ చికిత్స సత్ఫలితాలు ఇవ్వదు. అందుకే రోగికి రక్తం, షుగర్‌, హార్మోన్స్‌, కొవ్వుశాతం, లోకల్‌ పరిస్థితి, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వంటి పరీక్షలు చేస్తారు. ఆ ఫలితాల ఆధారంగానే చికిత్స మొదలుపెట్టి జట్టు మెలిచేలా చేస్తారు.

యువతలోనే ఎక్కువ

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్రలేమి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలే జుట్టు రాలడానికి కారణం. ఈ సమస్యకు మా దగ్గర అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం.
- డాక్టర్‌ బాలచంద్రుడు, చర్మవ్యాధుల విభాగాధిపతి
 
ఫలితాలు బాగున్నాయ్‌
పీఆర్పీ చికిత్సకు బయట భారీగానే ఖర్చు అవుతుంది. ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.2వేలు వసూలు చేస్తారు. 5 నుంచి 15 సిటింగ్‌లు అవసరం అవుతుంది. మేం ఉచితంగానే చేస్తున్నాం. మెరుగైన ఫలితాలే వస్తున్నాయి.
- డాక్టర్‌ గురుప్రసాద్‌, ప్రొఫెసర్‌, కేజీహెచ్‌