బరువుకు ఇలా చెక్‌ పెట్టండి... నేడు వరల్డ్‌ ఒబేసిటి డే

నేడు వరల్డ్‌ ఒబేసిటి డే
చుట్టుముడుతున్న రుగ్మతలు
గుండెపై ఒత్తిడి..మోకాళ్లపై భారం
పిల్లల్లో తీవ్రం
ప్రస్తుతం మనిషికి బరువు భారమవుతోంది. స్థూలకాయంతో లేనిపోని రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. పొట్ట పెరిగి రోగాల పుట్టగా మారుతోంది. శరీర భారమంతా మోకాళ్ల మీద పడుతోంది. దాన్ని మోయలేక మోకాళ్ల కీళ్లు అరుగుతున్నాయి. ఆయాసపడుతూ అడుగులేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. శరీర భాగాలకు రక్త సరఫరా చేసే గుండెపై కూడా బరువు భారం ఒత్తిడి పెంచుతోంది. సాధారణ బరువు కంటే ఏ కొంచెం పెరిగినా అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. చిన్నా.. పెద్ద తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది. దీనికి కారణం.. వేళాపాళా లేని భోజనం, వ్యాయామం లేని జీవితం, బయట ఏది దొరికితే అది తినేయడమేనని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో.. నేడు వరల్డ్‌ ఒబేసిటి డేను పురస్కరించుకుని స్థూలకాయుల కోసం వైద్యులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆ వివరాలు కొన్ని...
 
హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి), 11-10-2018: ప్రస్తుతం చాలా మంది స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ రకాల కొత్త జబ్బుల బారిన పడుతున్నారు. పిల్లల నుంచి మొదలు టీనేజీ, యువకులు, నడివయస్కులు, పెద్దవాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ అధిక బరువుతో సతమతమవుతున్నారు. చాలా మంది శారీరక శ్రమ తగ్గించడమే కాకుండా ఫాస్ట్‌ఫుడ్‌ వంటి వాటికి అలవాటు పడడంతో స్థూలకాయం పెరిగిపోతోందని వైద్యులు పేర్కొంటున్నారు. అదే సందర్భంలో.. అధిక బరువును తగ్గించుకోవడానికి స్థూలకాయులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావంటున్నారు డాక్టర్లు. కొందరు బేరియాట్రిక్‌ సర్జరీలు, ఇతర శస్త్రచికిత్సలను సైతం చేయించుకుంటున్నారని వివరిస్తున్నారు.
 
యువతలోనే ఎక్కువ...
ముఖ్యంగా యువతలో అధిక బరువు ఎక్కుగా కనిపిస్తోంది. ప్రతి రోజు స్థూలకాయ సమస్యలతో తమ వద్దకు వచ్చే ఏడుగురిలో ముగ్గురు యువకులే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు 140 కిలోల వరకు బరువు ఉంటున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గడమేనని వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో రోజుకు రెండు, మూడు పూటల భోజనం చేస్తే, ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఐదారు సార్లు ఆహార పదార్థాలు తింటున్నారు. మహిళల్లో కూడా అధిక బరువు సమస్య పెరుగుతోందని చెబుతున్నారు. నడి వయస్సు మహిళల్లో పీరియడ్స్‌ ఆగిపోవడం వల్ల కూడా స్థూలకాయం వస్తుందన్నారు.
 
కదలలేక, శారీరక శ్రమ లేక...
చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు లేవకుండా పనిలో ఉండిపోవడం అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది. ఉదయం 10 గంటలకు మొదటు పెట్టిన పనిని రాత్రి 10 గంటలకు చేస్తూనే ఉంటున్నారు. టార్గెట్‌ను పూర్తి చేయడానికి గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చుంటున్నారు. దీంతో శరీరంలో కదలికలు తగ్గిపోయి, నడక లేకపోవడంతో అధిక బరువు వచ్చేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
 
బరువుకు ఇలా చెక్‌ పెట్టండి...
ఆహారపు అలవాట్లు, జీవన శైలిని మార్చుకోవాలి.
ఒకే సారి ఎక్కువ మొత్తంలో భోజనం చేయొద్దు.
కడుపు నిండా కాకుండా కొంత ఖాళీగా ఉండే విధంగా చూసుకోవాలి.
భోజనానికి, భోజనానికి వ్యవధి ఎక్కువ ఉండకూడదు.
మూడు గంటలకోసారి కొద్దిగా కొద్దిగా తినాలి.
ఒకే విధమైన ఆహారం ఎక్కువగా తీసుకోవద్దు.
మధ్యాహ్నం 3 గంటల తరువాత లంచ్‌, రాత్రి 10 గంటల తరువాత డిన్నర్‌ మానివేయాలి.
ఓ రెండు ఇడ్లీలతో పాటు మొలకెత్తిన గింజలు తీసుకోవడం మంచిది.
ఇంట్లో పనులన్నీ ఎవరికి వారే చేసుకోడం ఉత్తమం.
నిత్యం వ్యాయామం అలవాటు చేసుకోవాలి.
చిప్స్‌, క్రాకర్స్‌, స్నాక్స్‌ వంటి జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవద్దు.
ఫ్రై, బర్గర్స్‌, షేక్స్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ జోలికి వెళ్లొద్దు.
బాగా రిఫైన్‌ చేసిన ఆహారపదార్థాలను పూర్తిగా మానేయాలి.
తియ్యగా ఉండే సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడా, ఫ్రూట్‌ జ్యూసులతో రిఫైన్‌ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవద్దు.
కొద్దిపాటి బరువును కొన్ని రకాల మందులతో తగ్గించవచ్చు.
ఆహారంలోని కొవ్వు శరీరంలోకి ఇంకిపోకుండా చేసే మందులు వాడాలి.
బరువు ఎక్కువైతే సర్జరీ ద్వారా తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గితే...

అధిక బరువు ఉన్న వారు ఒక పది కిలోల బరువు తగ్గితే... రక్తపోటు, రక్తంలో చక్కెర శాతం, కీళ్లనొప్పులు తగ్గుతాయి. శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌కు దారి తీసే ట్రైగ్లిసరైడ్స్‌ తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల కీళ్ల మీద పడే భారం తగ్గిపోతుంది. ఆయాసం లేకుండా సులువుగా నడవవచ్చు.

పిల్లల్లో స్థూలకాయ సమస్య తీవ్రం...

పిల్లల్లో స్థూలకాయ సమస్య తీవ్రమవుతోంది. ఇంతకు ముందు 6 శాతం మంది పిల్లలు స్థూలకాయంతో బాధపడితే ఇప్పుడా ఆ సంఖ్య 13 శాతం వరకు పెరిగింది. చాలా మంది పిల్లల్లో దైనందిన కార్యక్రమాలు తగ్గాయి. చురుకుదనం పెంచే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పిల్లలకు వ్యాయామం నేర్పించడం లేదు. రోజూ 45 నిమిషాలు నడిచేట్లు చూసుకోవాలి. ఆహారంలో ఎక్కువ విటమిన్స్‌ ఉండే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. సాధారణం కంటే 25 కిలోల బరువు ఎక్కువగా ఉండే వారిలో ఆహార నియమాలు, వ్యాయామంతో స్థూలకాయాన్ని తగ్గించలేం. పిల్లల్లో స్థులకాయ సమస్యను నివారించడానికి ఫిట్‌చైల్డ్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
- డాక్టర్‌ లక్ష్మీకాంత్‌, బేరియాట్రిక్‌ సర్జన్‌, స్టార్‌ ఆస్పత్రి

ఆరోగ్య జీవనానికి హాని...

స్థులకాయం ఒక జబ్బు కాదు. కానీ ఈ బరువు ఆరోగ్యకరమైన జీవనానికి హని చేస్తుంది. రోగాలు రావడానికి ప్రధాన కారణం అధిక బరువు. మారిన జీవనశైలి, జన్యు కారణాలు.. వల్ల ఒబేసిటి బారిన పడుతున్న వారెందరో. వయసుతో సంబంధం లేకుండా వస్తోన్న ఈ సమస్యపై అవగాహన పెంచుకోవాలి. అధిక బరువు మానసిక సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, ఆర్థరైటిస్‌, గుండె జబ్బులు, పక్షవాతం, స్లీప్‌ అప్నీయా, గాల్‌ స్ట్రోన్స్‌, వ్యంధత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. అధిక బరువును తగ్గించుకునే విషయంలో ఏ మాత్రమూ నిర్లక్ష్యం చేయొద్దు.
- డాక్టర్‌ సీఆర్‌కే ప్రసాద్‌, ల్యాప్రోస్కోపిక్‌, బేరియాట్రిక్‌ సర్జన్‌, అపోలో ఆస్పత్రి