గడ్డిమందుతో కేన్సర్‌.. నిజమే

‘మోన్‌శాంటో’కు 2వేల కోట్ల జరిమానా.. అమెరికా కోర్టు సంచలన తీర్పు

శాన్‌ఫ్రాన్సిస్కో, ఆగస్టు 11: పంట పొలాల్లో కలుపుమొక్కల్ని నాశనం చేసే గడ్డిమందు(గ్లైఫోసేట్‌)తో కేన్సర్‌ వస్తుందని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు స్పష్టం చేసింది. కేన్సర్‌ బారిన పడ్డ ఓ వ్యక్తి తాను ఆ రసాయనం వాడటం వల్లే వ్యాధి వచ్చిందని, తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తులు సంచలన తీర్పు వెలువరించారు. రౌండప్‌ పేరుతో మోన్‌శాంటో కంపెనీ విడుదల చేసిన ఈ మందుతో కేన్సర్‌ వచ్చినట్లు గుర్తించి.. ఆ కంపెనీకి రూ.2వేల కోట్ల జరిమానా విధించారు. కాలిఫోర్నియాకు చెందిన డెవేన్‌ జాన్సన్‌(46) ఓ పాఠశాలలో గ్రౌండ్స్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో మైదానంలో గడ్డి పెరగకుండా రోజూ గడ్డిమందును చల్లేవాడు.

2014లో లింఫోమా(కేన్సర్‌)కు గురయ్యాడు. అతడి వైద్యులు గడ్డిమందు వల్లేనని గుర్తించి, వ్యాధి బాగా ముదిరిందని రోజులు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. సదరు రసాయనం వల్లే వ్యాధికి గురయ్యానని- తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. తాను ఇంటి వద్దే ఉండటంతో తన భార్య రోజుకు 14 గంటలపాటు కష్టపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు బాధితుడికి 289 మిలియన్‌ డాలర్లు(రూ.2వేలకోట్లు) చెల్లించాలని మోన్‌శాంటో కంపెనీని ఆదేశించారు.