స్మార్ట్‌ ఫోన్‌తోనే బీపీ పరీక్ష

కొత్త యాప్‌ అభివృద్ధి చేసిన పరిశోధకులు

భారత సంతతి సైంటిస్ట్‌ నేతృత్వంలో రిసెర్చ్‌

14-03-2018: సంప్రదాయ బీపీ పరికరాలకు కాలం చెల్లుతోంది. ఎలకా్ట్రనిక్‌ మెషీన్లు కూడా పాతవైపోతున్నాయి. కొత్తగా బీపీ యాప్‌ టెక్నాలజీని వచ్చేసింది. మీ స్మార్ట్‌ఫోన్‌తోనే బీపీ పరీక్ష చేసుకోవడానికి వీలుగా అప్లికేషన్‌, హార్ట్‌వేర్‌ను భారతీయ సంతతి సైంటిస్ట్‌ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసింది. ప్రస్తుత బీపీ పరికరాలన్నింటి కంటే ఇది అత్యంత కచ్చితంగా రక్తపోటును లెక్కగడుతుందని మిషిగన్‌ స్టేట్‌ వర్సిటీ, వర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ పరిశోధకుల బృందం చెబుతోంది. ‘మేం విభిన్నమైన నాడిని లక్ష్యంగా చేసుకున్నాం. వేలికొన ద్వారా కచ్చితమైన బీపీ విలువ తెలుసుకోవచ్చు’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆనంద్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

 
యాప్‌తో బీపీ ఎలా తెలుసుకోవచ్చు?
ఈ ప్రక్రియలో రెండు సెన్సార్లు ఉంటాయి. మొదటిది యాప్‌లోని ఆప్టికల్‌ సెన్సార్‌. రెండోది స్మార్ట్‌ ఫోన్‌ వెనుక అమర్చే ఒక సెంటీ మీటరు మందంతో ఉండే సెన్సార్‌ యూనిట్‌! బీపీ చెక్‌ చేసుకోవాలనుకుంటే మొదట యాప్‌ను ఆన్‌ చేసి..ఫోనును గుండెకు సమాంతరంగా ఉంచి..వేలి కొనను సెన్సార్‌ యూనిట్‌పై ఉంచాలి. కాసేపటికి యాప్‌కు డేటా అందుతుంది. దానిని బీపీ రీడింగ్‌గా మార్చి.. స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్‌మీద చూపిస్తుంది. సెన్సార్‌ యూనిట్‌పై నిర్ణీత సమయంలో వేలి కొన కల్గించే ఒత్తిడి.. కచ్చితత్వానికి దోహదం చేస్తుందంటున్నారు పరిశోధకులు! ఒక్కోసారి హైబీపీ గుండెపోటుకు దారితీయవచ్చు. అందుకే రక్తపోటుతో బాధపడేవారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తమ బీపీ యాప్‌ ద్వారా ప్రతిరోజూ సులభంగా బీపీ చెక్‌ చేసుకోవడానికి, కచ్చితమైన ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు!