గంటలో వెయ్యిమందికి బీపీ చెకప్‌

గాంధీ ఆస్పత్రికి గిన్నిస్‌ రికార్డు

అడ్డగుట్ట, ఫిబ్రవరి 1 ( ఆంధ్రజ్యోతి): పేదల పెద్దాస్పత్రిగా పేరుగాంచిన గాంధీకి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో వివరాలు వెల్లడించారు. గత సెప్టెంబర్‌ 24న గాంధీ ఆస్పత్రిలోని మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ వార్డులో గంట వ్యవధిలో 1000 మంది రోగులకు బీపీ చెక్‌ చేసి రికార్డు సాధించామని తెలిపారు. అందుకుగానూ గిన్నిస్‌ రికార్డు దక్కిందన్నారు. రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందిస్తున్నామని, వైద్యుల పనితీరు బాగుందని అన్నారు. మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సిబ్బంది, నర్సులను అభినందించారు. సమావేశంలో గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంఓ-1 డాక్టర్‌ జయకృష్ణ, శేషాద్రి, గాంధీ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాజారావు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ వినయ్‌ శేఖర్‌ పాల్గొన్నారు.